»Donald Trump Reaction On His Attack Trump Assassination Attempt Updates Ex Us President In Milwaukee To Confirm Gop Nomination
Donald Trump : దేవుడే తనను మృత్యువు నుంచి కాపాడాడన్న ట్రంప్.. నామినేషన్ షురూ
తనను మరణం నుంచి దేవుడే రక్షించాడని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇలాంటి సమయంలో అంతా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం ఆయనను అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా రిపబ్లికన్ పార్టీ నామినేట్ చేయనుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Donald Trump : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై(DONALD TRUMP) శనివారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తాజాగా ట్రంప్ స్పందించారు. తనను దేవుడే మృత్యువు నుంచి కాపాడాడని అన్నారు. ఇలాంటి సమయంలోనే అంతా ఐక్యంగా నిలబడాలంటూ పిలుపునిచ్చారు. చెడును గెలవనీయకుండా చేయడం అమెరికన్లుగా మన నిజమైన పాత్ర అని అన్నారు. అందుకు అంతా బలంగా నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఆయన ప్రసంగిస్తున్న సమయంలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి చెవికి బుల్లెట్ తగిలి రక్తం కారింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ట్రంప్ టీషర్టులు : ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే రక్తంతో తడిచిన ట్రంప్ ఫోటోలతో టీ షర్టులు మార్కెట్లోకి వచ్చాయి. చైనా వ్యాపారులు ఈ షర్టులను ముద్రించి మార్కెట్లో పెట్టారు. మొదటగా అలీబాబాలో ఈ షర్టులు ప్రత్యక్షం అయ్యాయి. కేవలం మూడు గంటల్లోనే రెండు వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయని సంబంధిత వ్యాపారి తెలిపారు. డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని తయారు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక డొనాల్డ్ ట్రంప్‌ను నేడు అధికారికంగా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయనున్నారు.సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు మివాకీలో రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరగనుంది. ఈ సమావేశాల్లో ఆయన నామినేట్( Nomination) కానున్నారు. ట్రంప్‌పై కాల్పుల ఘటన అనంతరం ఈ కన్వెన్షన్ జరుగుతోంది. దీంతో ఈ సమావేశాల వేదిక వద్ద భద్రతను మరింత పెంచారు. ఇదిలా ఉండగా నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.