Chandrayaan-3: అంతరిక్షం నుంచి భూమి ఫోటోలు పంపిన చంద్రయాన్-3
ఇస్రో చంద్రునిపైకి పంపిన చంద్రయాన్3 భూమి ఫోటోలను తీసింది. మూడు రోజులకు ముందు చంద్రుని ఫోటోలు పంపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23వ తేదిన చంద్రుని ఉపరితలంపై ఇది ల్యాండ్ కానుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో(ISRO) జూలై 14వ తేదిన చంద్రయాన్3(Chandrayaan-3)ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ల్యాండర్ ఆగస్టు 5వ తేదిన చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రునికి సంబంధించిన ఫోటోలను అప్పటి నుంచి ఇస్రో తన ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేస్తూ వస్తోంది. చంద్రయాన్3 ల్యాండర్ తన ఇమేజ్ కెమెరా నుంచి తీసిన రెండు ఫోటోలను పంచుకుంది.
చంద్రుని ఫోటోలతో పాటుగా భూమికి సంబంధించిన ఫోటోలను కూడా ఇస్రో(ISRO) తెలిపింది. చంద్రయాన్3 పంపిన ఫోటోల్లో భూమికి సంబంధించిన ఫోటోలో ఓ చోట సూర్యరశ్మి ఉండగా, మరోచోట నీడ కనపడుతోంది. అవే కాకుండా చంద్రుని ఫోటోల్లో గుంతలు కూడా కనిపిస్తున్నాయి. ఆ గుంతలు కూడా కొన్నిచోట్ల పెద్దవిగా, మరికొన్నిచోట్ల చిన్నవిగానూ కనపడుతున్నాయి. చంద్రునిపై చాలా చోట్ల చీకటే ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.
చంద్రయాన్3 పంపిన భూమి ఫోటోల్లో కూడా కొన్నిచోట్ల చీకటి కనిపిస్తోంది. చంద్రయాన్3 (Chandrayaan-3) ఏ టైంలోనైనా చంద్రుని ఉపరితలంపైన ల్యాాండ్ అవ్వొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాహన వేగాన్ని తగ్గించిన తర్వాత ఆగస్టు 23వ తేదిన చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ ఉంటుందని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ (Isro Chief somanath) వెల్లడించారు. ప్రస్తుతం చంద్రయాన్3 పంపిన భూమి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్(Photos Viral) అవుతున్నాయి.