కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200మంది ప్రయాణికులున్న పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో దాదాపు 145 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 55మంది అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. లులోంగా నదిలో మోటారు బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటున్నారు అధికారులు. నిజానికి ఈ మధ్యనే కాంగోలో తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోగా ఆ విషాదం మరువక ముందే ఈ ప్రమాదం జరగడం విచారకరం.
మోటార్ బోటులో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా.. బసన్కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఇక పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం.. వస్తువులు, పశువులు కూడా ఉండటంతో అధిక బరువుతో పడవ నదిలో మునిగి పోయింది. ఆ సమయంలో ఈత రాని వారు నీటిలో మునిగి అక్కడిక్కడే మరణించారని అంటున్నారు. కాంగోలో అధిక సంఖ్యంలో రోడ్లు లేకపోవడంతో.. జనాలు పడవల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కాగా… ఇక్కడ పడవ ప్రమాదాలు జరగడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.