ఐర్లాండ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. తెలంగాణ సంస్కృతి ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తోంది. అందులో భాగంగా ప్రతి దేశంలో కూడా బతుకమ్మ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. తెలంగాణ ఎన్నారైలు అంతా కలిసి ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు దాదాపుగా 850 మంది వరకూ హాజరయ్యారు.
భారతీయత ఉట్టిపడేలా ఈ సంబరాల్లో ఎన్నారైలు సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. ఈ సందర్భంగా ఆడపడుచులంతా ఆటపాటలతో బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కోలాటం, దాండియా ఆడారు. మన సంస్కృతి సంప్రదాయాలు ఐర్లాండ్ ప్రజలకు తెలియచేయాలనే లక్ష్యంతో 11 ఏళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎన్నారైలు దయాకర్ రెడ్డి కొమురెల్లి, కమలాకర్ రెడ్డి కొలను, జగన్ మేకల, అల్లే శ్రీనివాస్, సిల్వెని శ్రీను, వెంకట్ జూలూరి, త్రిశీర్, రమణ రెడ్డి, రాజా రెడ్డి, సుమంత్ తెలిపారు . ఈ సందర్భంగా ఐర్లాండ్ తెలంగాణ ఎన్నారై ఫోరమ్ (Telanganites Of Ireland) వ్యవస్థాపకులు ప్రభోద్ రెడ్డి మేకల, సిద్ధం సాగర్ లను ఘనంగా సత్కరించారు.