భారత్ లో తయారు చేసిన దగ్గుమందు తీసుకొని ఉజ్బెకిస్థాన్‌లోని కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఈ ఘటన నేపథ్యంలో మనదేశంలో తయారు చేస్తున్న రెండు రకాల దగ్గుమందులపై నిషేధం విధిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్థాన్‌లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసింది.
ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది పిల్లల మరణాలకు భారతదేశానికి చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని తేలిన తర్వాత డబ్ల్యూహెచ్‌వో ఈ సిఫారసు చేసింది. దగ్గు సిరప్ లైన అబ్రోనాల్ , డీఓకే-1 మాక్స్ సిరప్ లలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ ఎక్కువగా ఉందని లాబొరేటరీ విశ్లేషణలో తేలినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసిన సిరప్ లు తాగడం వల్ల తమ దేశంలో 18 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారుల మరణానికి కారణమైన మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్‌ను ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది.