Ranga Marthanda Movie Review: రంగ మార్తాండ మూవీ రివ్యూ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. అదే రంగ మార్తాండ. చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో కూడా బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో అసలు ఈ సినిమా స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూవీ – రంగ మార్తాండ
దర్శకుడు – కృష్ణ వంశీ
నటీనటులు – బ్రహ్మనందం, ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా, తదితరులు
సంగీత దర్శకుడు – ఇళయరాజా
నిర్మాతలు – కలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
నిర్మాణ సంస్థలు – రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్‌ఫుల్ మూవీస్
థియేట్రికల్ విడుదల తేదీ – మార్చి 22, 2023
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ(Krishna Vamsi) చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. అదే రంగ మార్తాండ(Rangamarthanda). అయితే ఈ చిత్రం మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన మరాఠీ బ్లాక్ బస్టర్ మూవీ నటసామ్రాట్ కు అధికారిక రీమేక్ గా వచ్చింది. మరాఠీలో ఈ సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేశారు. ఇక తెలుగులో ప్రకాశ్ రాజ్(Prakash Raj) ప్రధాన పాత్రలో నటించారు. అయితే కృష్ణ వంశీ గతంలో గులాబీ, నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, చక్రం, రాఖీ, చందమామ, మహాత్మా వంటి హిట్టు చిత్రాలకు దర్శకత్వం వహించారు. దీంతో తాజాగా తీసిన రంగమార్తాండ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరిగింది. అయితే కృష్ణ వంశీ నుంచి చివరగా 2017లో నక్షత్ర చిత్రం తర్వాత చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో కూడా బజ్ ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సహా డైలాగ్ ప్రొమోలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ సినిమా స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
రాఘవరావు (Prakash Raj) రంగస్థల కళాకారుడు. తన వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకున్న థియేటర్ ఆర్టిస్ట్. కళకు ఆయన చేసిన అపూర్వమైన కృషికి గాను అతనికి రంగమార్తాండ అనే బిరుదు కూడా ఇస్తారు. అయితే రాఘవరావు పెద్దవాడవుతున్న కొద్దీ, అతను తన వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకుంటాడు. రాఘవరావు మిత్రుడిగా చక్రపాణి(Brahmanandam) యాక్ట్ చేశారు. తాను సంపాదించిన సంపదను రాఘవరావు మొత్తం పిల్లలకు అప్పగిస్తాడు. ఆ నేపథ్యంలో తన పిల్లలైన శ్రీ (Shivathmika Rajashekar), రంగా (Aadarsh Balakrishna)కి పంచుతాడు. కానీ వారి ఆస్తిని పిల్లలకు ఇచ్చిన తర్వాత అతను, భార్య రాజు గారు (Ramya Krishnan) పిల్లల ప్రవర్తన కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వారి మధ్య వచ్చిన సమస్యలు ఏంటి? రంగమార్తాండ రాఘవరావు, ఆయన పిల్లల మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? పిల్లలు ఉన్నప్పటికీ కూడా వారు అనాథలుగా ఎందుకు భావిస్తారు అనేది అసలు స్టోరీ.
ఎవరెలా చేశారు
ఈ చిత్రంలో రాఘవరావు పాత్రలో ప్రకాష్ రాజ్(Prakash Raj) కాకుండా వేరే ఆర్టిస్టును ఊహించుకోవడం కష్టంమనే చెప్పవచ్చు. ఎందుకంటే అంత బాగా తన క్యారెక్టర్లో లీనమై యాక్ట్ చేశారు. పూర్తి స్థాయిలో ప్రకాశ్ రాజ్ తన నటనతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా చేశారు. ప్రకాష్ రాజ్ భార్యగా రమ్యకృష్ణ(Ramya Krishnan) అద్భుతంగా నటించింది. ఆమెకు తక్కువ డైలాగ్స్ ఉన్నప్పటికీ కూడా తన క్యారెక్టర్ మేరకు న్యాయం చేసింది. ఇక బ్రహ్మానందం(Brahmanandam) ఈ సినిమాలో మరోసారి తన అసాధారణ నటనతో భావోద్వేగానికి గురిచేస్తాడు. తన పాత్రలో భాగంగా కొన్ని సీన్లలో కళ్ళలో కన్నీళ్లు తెప్పించే విధంగా నటించాడు. ఇక రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) తన పాత్రలో బాగా నటించి, అక్కడక్కడా నవ్వించారు. శివాత్మిక రాజశేఖర్ నటన పరంగా ఇంకా మెరుగుపడాలనిపిస్తుంది. ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా(Ali Reza), అనసూయ(Anasuya Bharadwaj) డీసెంట్‌గా యాక్ట్ చేశారు.
సాంకేతిక అంశాలు
రంగ మార్తాండ మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కి అధికారిక రీమేక్. దర్శకుడు కృష్ణ వంశీ, అతని రచయితల బృందం చాలా అంశాలలో ఒరిజినల్‌కు కట్టుబడి అలాగే తీశారు. దర్శకుడు కృష్ణ వంశీ కొన్ని సన్నీవేశాల్లో తనదైన ముద్ర వేశాడనిపిస్తుంది. కొన్ని సీన్లలో తెలుగు భాష ప్రస్తావన, సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేస్తారు. తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టుగా కొన్నిఎలిమెంట్స్ తీసుకొచ్చారు. ఇళయరాజా సంగీతం 1980, 90ల పాతకాలపు కాలానికి తీసుకెళ్తుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల బడ్జెట్ లోపం కనిపిస్తుంది. ఎడిటింగ్, డబ్బింగ్ కూడా పర్వాలేదనిపిస్తుంది.
విశ్లేషణ
ప్రస్తుత తరంలో ఉన్న కుమారులు, కూతుర్లతోపాటు పేరెంట్స్ కూడా ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ చిత్రం ప్రస్తుత జీవనశైలిని ఆవిష్కరించే కథ అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో తమ తల్లిదండ్రులను పిల్లలు ఎలా పట్టించుకోవడం లేదనే విషయాన్ని తెలియజేస్తోంది. సెకండాఫ్ మొత్తంలో చాలా ఎమోషనల్ సీక్వెన్స్‌లు ఉంటాయి. ఇది చాలా మెలోడ్రామాటిక్ పద్ధతిలో మన తల్లిదండ్రుల విలువను చక్కగా చూపిస్తుంది. కొన్ని సీన్లు అయితే మనల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక అతిపెద్ద అసెట్. దాదాపు ప్రతి నటీనటులు వారి వారి పాత్రలకు బాగా సరిపోయారు. మొత్తం మీద రంగ మార్తాండ మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే మనసుకు హత్తుకునే చిత్రం.
ప్లస్ పాయింట్స్
ప్రకాశ్ రాజ్, బ్రహ్మనందం యాక్టింగ్
భావోద్వేగ సీన్స్
మ్యూజిక్
ఈ తరానికి ఇచ్చే సందేశం
మైనస్ పాయింట్స్
కొన్ని సీన్లు స్లోగా అనిపిస్తాయి
ట్విస్టులు లేకపోవడం