మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అటు సినిమాల విషయం దగ్గర నుంచి ఇటు.. రాజకీయాల వరకు అన్ని విషయాలపై ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తన సోదరులు చిరు, పవన్ లపై ఈగ వాలినా అంగీకరించడు. వారిపై ఎవరైనా విమర్శలు చేస్తే…. సమాధానం ఇచ్చే వరకు ఊరుకోడు. తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో ఆయన చిరంజీవిని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తన అన్న చిరంజీవి పై ఒకప్పుడు పూలు విసిరిన వాళ్లే… తర్వాత రాళ్లు రువ్వేలా మాట్లాడరని మండిపడ్డారు. తమ ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అందరం కలిసే ఉన్నామని చెప్పారు. తమ కుటుంబం మీద ఈగ వాలితే ఎంతకైనా వెళ్లగలిగే అభిమానులు ఉన్నారని అన్నారు. మనసుకు నచ్చక రాజకీయాల్లో నుంచి చిరంజీవి వెనక్కి వచ్చారని చెప్పారు. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి తిరిగి సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా అభిమానులు అదే రకమైన ప్రేమను చూపెట్టారని అన్నారు. చిరంజీవి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే నమ్మకం అయితే తనకు లేదని చెప్పారు.
ఇటీవల ఒక ప్రముఖుడు చిరంజీవిని నోటికొచ్చినట్టుగా మాట్లాడానని అప్పుడు సోదరుడిగా తాను స్పందించానని.. అంతకంటే ఎక్కువగా అభిమానులు రియాక్ట్ అయ్యారని చెప్పారు. చిరంజీవి వినయ విధేయలతో ఉన్నారని అడ్వాంటేజ్ తీసుకుని ఆయనను ఎవరైనా ఏమైనా అంటే ముందుగా రియాక్ట్ అయ్యేది అభిమానులేనని అన్నారు. తాను ఎవరిని రెచ్చగొట్టనని.. శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా తాము ఎప్పుడూ వ్యవహరించమని చెప్పారు.
‘‘సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి వెళ్లినప్పుడు.. ఆయన వైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులను చూశాం. నువ్వు ఎంతపెద్ద నాయకుడివి అయితే మాకేంటి.. మేము ఏమైనా అన్నామా?. రెస్పెక్ట్ అనేది ముఖ్యం. చిన్నైనా, పెద్దైనా గౌరవించాలి. ఒకప్పుడు అదే వ్యక్తిని నువ్వు సాదారంగా ఆహ్వానించి పూలు చల్లి తీసుకెళ్లావు. నీ టైమ్ మారింది. నువ్వు పెద్దోడివి అయి ఉండోచ్చు. చిరంజీవి అల్రెడీ పెద్ద వ్యక్తి.. ఎప్పటికీ అక్కడే ఉంటాడు. నువ్వు రేపు పొద్దున దిగొచ్చు.. కానీ చిరంజీవి అక్కడే ఉంటాడు’’ అని నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనే చర్చ మొదలైంది.