కెరీర్ స్టార్టింగ్‌లో కామెడీ సినిమాలతో దుమ్ములేపాడు అల్లరి నరేష్. అసలు నరేష్ కామెడీ అంటే.. జనం చెవులు కోసుకునే వారు. కానీ మధ్యలో నరేష్ ట్రాక్ తప్పాడు. రొటీన్ కామెడీతో అలరించలేకపోయాడు. అందుకే రూట్ మార్చి సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు నరేష్. 2021లో వచ్చిన నాంది మూవీ నరేష్‌కి సూపర్ హిట్ ఇచ్చింది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా.. నిజంగానే నరేష్‌కు కెరీర్‌కు మరో నాంది పడేలా చేసింది. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం మరోసారి ఫ్లాప్ అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో మరోసారి నాంది డైరెక్టర్ పైనే ఆశలు పెట్టుకున్నాడు అల్లరోడు. హిట్ కాంంబోలో ఉగ్రం అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. తాజాగాఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా.. అనౌన్స్మెంట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో నరేష్ ఉగ్ర రూపం చూపించాడు. బైక్ పై వచ్చి కసితో.. తుపాకీతో ఎవరినో కాలుస్తున్నట్లు చూపించారు. ఆ బుల్లెట్ నుంచి రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఉగ్రం ఏప్రిల్ 14న థియేటర్లలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇకపోతే.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మిర్నా హీరోయిన్గా నటిస్తోంది. మరి నాంది తర్వాత ఉగ్రంతో.. మరోసారి సీరియస్ మోడ్ ట్రై చేస్తున్న అల్లరి నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.