»Good News For Devotees Amarnath Yatra Will Start From July 1
Amarnath Yatra 2023: భక్తులకు శుభవార్త..జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
అమర్నాథ యాత్ర జులై 1 నుంచి మొదలవుతోంది. ఈ యాత్రకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వసతి, సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra) జులై 1 నుంచి ప్రారంభ కానుంది. సముద్ర మట్టానికి 13,600 అడుగుల ఎత్తులో అమర్నాథ్ ఆలయం ఉంది. జులై 1 నుంచి ఆగస్టు 31వ తేది వరకూ మొత్తం 62 రోజుల పాటు మాత్రమే అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు ఏప్రిల్ 17 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శివుడు కొలువై ఉన్న ఈ అమర్నాథ్ పుణ్యక్షేత్రానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్లి రావాలని అందరూ అనుకుంటూ ఉంటారు.
ఈ అమర్నాథ్ ఆలయం(Amarnath Temple) జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. అమర్నాథ్ గుహ అనేది సముద్రమట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉండటంతో ఇక్కడికి వెళ్లేందుకు కష్టంతో కూడుకున్న పని. ఈ క్షేత్రం పహల్గామ్ నుంచి 45 కి.మీ, శ్రీనగర్ నుంచి 141 కి.మీ దూరంలో ఉండటమే కాకుండా మంచు తీవ్రత కూడా విపరీతంగా ఉంటుంది.
స్వామి వివేకానంద కూడా 1898లో ఈ గుహను సందర్శించారు. శివ భక్తులు అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)ను స్వర్గానికి మార్గంగా భావిస్తూ ఉంటారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది.