»Seven Members Of The Same Family Committed Suicide
Family suicide:ఘోరం..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య
ఆర్థిక సమస్యలు భరించలేక ఓ కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానికలంగా కలకలం రేపింది. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఫ్యామిలీ సూసైడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య (family mass suicide) చేసుకున్నారు. మృతిచెందిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఇంట్లో సూసైడ్ నోట్ కూడా లభించింది. పోలీసుల వివరాల మేరకు..కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. గుజరాత్ (Gujarat)లోని సూరత్‌లో ఈ ఘోరం చోటుచేసుకుది. శనివారం అడాజన్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటు ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు.
పొరుగువారు ఆ ఇంటికి వెళ్లి డోర్ కొట్టినా, బెల్ మోగించినా ఇంట్లోనివారు ఎవ్వరూ స్పందించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి డోర్‌ను పగలగొట్టి లోనికి ప్రవేశించారు. మృతులను 35 ఏళ్ల మనీష్ సోలంకి, 32 ఏళ్ల భార్య రీటా, 7 ఏళ్ల దిశ, 5 ఏళ్ల కావ్య, మూడేళ్ల ఖుషాల్గా పోలీసులు గుర్తించారు. అలాగే మనీష్ తల్లిదండ్రులైన 65 ఏళ్ల కాంతిలాల్ సోలంకి, 60 ఏళ్ల శోభనగా పోలీసులు గుర్తించి వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుటుంబంలోని ఆరుగురు విషం తాగి చనిపోయారని, అయితే మనీష్ మాత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యల వల్లే వారంతా ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఓ నోట్ రాసి ఉంది. విషం బాటిల్‌ను, సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనీష్ ఫర్నీచర్ వ్యాపారంతో పాటుగా కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు.
తను ఉండే అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయని, చాలా కాలంగా కుటుంబం అంతా అక్కడే కలిసి ఉందని విచారణలో తెలిసిందే. అయితే చాలా మందికి డబ్బులు అప్పుగా మనీష్ ఇచ్చాడని, దీపావళి సమీపిస్తున్న తరుణంలో డబ్బులు తిరిగి ఇవ్వాలని వారిని మనీష్ డిమాండ్ చేశాడు. వారెవ్వరూ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది తన కుటుంబసభ్యులకు విషం ఇచ్చిన తర్వాత తాను ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఫ్యామిలీ సూసైడ్‌కు కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.