ఓ యువకుడి చేతిలోని సెల్ఫోన్ని కొందరు దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. తన మొబైల్ తనకు ఇవ్వవలసిందిగా వేడుకోవడంతో అతడిని కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Man Killed : సెల్ ఫోన్ కోసం ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మార్చి ఏడో తారీఖున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు. నంద్యాల జిల్లా అలవ కొండ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ గౌడ్ (21) అనే యువకుడు సికింద్రాబాద్లో హాస్టల్లో ఉంటూ చర్లపల్లిలోని ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు.
స్నేహితుడితో కలిసి అనిల్ ఈ నెల ఏడో తారీఖున కాచిగూడలో రైలు ఎక్కి సికింద్రాబాద్ వెళుతున్నాడు.. రైలులో డోర్ పక్కన నిలబడి సెల్ ఫోన్లో(Mobile Phone) మెసేజ్లు చేస్తున్నాడు. అదే సమయంలో చిలకల గూడ చౌరస్తా సమీపంలో రైలు పట్టాల పక్కన వారాసిగూడకు చెందిన సంకు రాహుల్(19), కాపరి సూరజ్ కుమార్(21), దూద్బావికి చెందిన మాదన రవితేజ(19), చింతకుంట ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(19), మరో 16 ఏళ్ల బాలుడు కలిసి దుడ్డు కర్ర పట్టుకుని నిలబడ్డారు.
రైలు మెల్లగా కదులుతున్న సమయంలో కర్రతో అనిల్ కుమార్ చేతిలోని సెల్ఫోన్ని కొట్టారు. దీంతో అది కింద పడిపోయింది. వెంటనే రైలు దిగిన అనిల్ తన ఫోన్ ఇవ్వాల్సిందిగా బతిమలాడాడు. అందుకు వారు ససేమిరా అన్నారు. కత్తితో పొడిచి హత్య(murder) చేశారు. తర్వాత మృత దేహాన్ని చిలకలగూడ రైల్వే డంపింగ్ యార్డ్లో పడేశారు. దీంతో తర్వాతి రోజు మృత దేహాన్ని గుర్తించిన పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పై విషయాలు వెల్లడయ్యాయి.