Janasena Nagababu: తన సోదరుడు నాగబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జన సేన ముఖ్య నాయకుల్లో ఒకరైన నాగబాబు అభ్యర్థిత్వం పొత్తుల కారణంగా త్యాగం చేయాల్సి వచ్చిందని ప్రకటించారు. తొలుత నాగబాబు లోక్ సభ అభ్యర్థితగా పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీలు పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ కూటమితో జట్టు కట్టడంతో త్యాగాలు తప్పలేదని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. ఈ విషయంపై స్వయంగా నాగబాబు (Nagababu) కూడా స్పందించారు. జన సైనికుడిగా పని చేయడం కంటే గొప్ప పదవి మరోటి లేదన్నారు.
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబంతో గడపాల్సిన విలువైన సమయాన్ని, సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఆస్తులను కూడా ప్రజల కోసం త్యాగం చేసే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని, పవన్ నాయకత్వంలో జనసేన పార్టీ కోసం పని చేయడం ఓ అదృష్టమని చెప్పారు. పవన్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్నారు. దాన్ని గౌరవిస్తానన్నారు. తమ సమస్యలను ప్రజల సమస్యలుగా భావించే నాయకులు చాలా మంది ఉన్నారన్నారు. అయితే ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అరుదని చెప్పారు.