గోడౌన్లో నిల్వ ఉంచిన ఇంధనం వద్ద పేలుడు సంభవించడంతో 34 మంది మృతి చెందారు. సంఘటనా స్థలాంలో శవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇంధన డిపోలో పేలుడు సంభవించడంతో 34 మంది దుర్మరణం చెందిన ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దక్షిణ బెనిన్ పట్టణంలో ఓ పాత ఇంధన డిపో వద్ద ఈ సంఘటన జరిగింది. ప్రమాద ఘటనలో గుట్టలుగా శవాలు కనిపించాయి. స్థానికంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారి సంఖ్య వెల్లడించలేదు.
గత కొన్ని రోజులుగా ఇంధన డిపోలో కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచి ఇంధనం వద్ద పేలుడు సంభవించిందని, ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి 30 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ గోడౌన్ నుంచి ఇంధనం ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుంటుంది. ప్రస్తుతం అక్కడ రహస్యంగా కొన్ని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇది వరకే తమకు సమాచారం వచ్చిందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.