Hyderabad : మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అనుమతులు, సెట్బ్యాక్లు లేకుండా నిర్మిస్తున్న బిల్డర్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా.. నిర్మాణాలు ఆగకపోవడంతో సోమవారం టీపీఎస్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చామని, త్వరలో మరిన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని టీపీఎస్ అధికారులు తెలిపారు. ఈ విషయమై శేరిలింగంపల్లి మండల అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
గతంలో కరోనా సమయంలో కూడా గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగింది. ట్రస్ట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో లాక్డౌన్ సమయంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ సిబ్బంది కొరడా ఝుళిపించారు. రెండు భవనాలను కూల్చివేయడమే కాకుండా 24 భవన నిర్మాణాలను అడ్డుకుని, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసు బలగాలతో వచ్చి ఆరు పెద్ద పెద్ద భవనాలకు సంబంధించిన శ్లాబ్‌లు కూలగొట్టారు. మరికొన్ని చోట్ల జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. గురుకుల్ భూముల్లో దాదాపు 40కిపైగా బహుళ అంతస్తుల భవనాలు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో కొన్ని భవనాలకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి.