»Hindu Temple Demolition Of A 150 Year Old Hindu Temple In Pakistan
Hindu Temple: పాక్లో 150 ఏళ్ల చరిత్ర ఉన్న హిందూ ఆలయం కూల్చివేత
పాకిస్తాన్ లోని 150 ఏళ్ల హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. అక్కడి అధికారులు, పోలీసుల సమక్షంలోనే ఈ కూల్చివేతలు జరిగాయి. దీనిపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పాకిస్తాన్ లోని కరాచీలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయం ఉంది. తాజాగా కరాచీలోని సోల్జర్ బజార్ లో మారిమాత ఆలయాన్ని కూల్చి వేశారు. ఓ షాపింగ్ ప్లాజా నిర్మించేందుకు బిల్డర్ ఆలయాన్ని కూల్చి వేసినట్లు సమాచారం. పాక్ సర్కార్ ఆలయ భూమిని షాపింగ్ ప్లాజా ప్రమోటర్ కు రూ.7 కోట్లకు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సమక్షంలోనే బుల్డోజర్ల సాయంతో ఆ ఆలయాన్ని కూల్చి వేశారు.
గత ఏడాది జూన్లో మారిమాత ఆలయంలో ఉన్న విగ్రహాలను ఎవరో దుండగులు ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది. పంచ్ముఖి హనుమాన్ మందిర్ కేర్ టేకర్ అయిన రామ్నాథ్ మిశ్రా మహారాజ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆలయం కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చివేసినట్లు వెల్లడించారు. అయితే ఆలయాన్ని ప్రమాదకర కట్టడమని అధికారులు ప్రకటించడంతోనే కూల్చివేసినట్లుగా స్థానిక పోలీసులు తెలిపారు.
హిందూ ఆలయాన్ని కరాచీలోని మద్రాసీ హిందూ సమాజం నిర్వహిస్తుండగా ఈ దారుణం జరిగింది. పాకిస్తాన్ హిందువులు అతి పెద్ద మైనార్టీ కమ్యూనిటీగా ఉన్నారు. పాకిస్థాన్ హిందూ జనాభాలో చాలా మంది సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలో స్థిరపడ్డారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలోనే హిందూ ఆలయాలు కూల్చి వేయడంతో స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.