హైదరాబాద్ (Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఆదిబట్ల సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) వద్ద కారులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారి మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనం అయ్యారు. కారు యజమాని వివరాలను పోలీసులు గుర్తించారు. కోదాడకు చెందిన వెంకటేష్ కారుగా గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. మృతుడు వెంకటేష్‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కారు ఆగివున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. కాగా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేకుంటే ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? అనే కోణంగా దర్యాప్తు సాగిస్తున్నారు. శనివారం రాత్రి కోదాడ నుంచి ఆ కారు హైదరాబాద్‌కు వచ్చింది. అందులో మంటలు ఒక్కసారిగా రావడంతో వెంకటేష్ సజీవ దహనం అయ్యాడని స్థానికులు వెల్లడించారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అర్థరాత్రి వేళ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఎవ్వరూ లేకపోవడం, నిర్మానుష్యంగా ఉండటంతో ఆయన్ని ఎవ్వరూ రక్షించలేకపోయారు. మంటలు అంటుకుని వెంకటేష్ సజీవ దహనం అయినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే కారులో చెలరేగిన మంటలపై క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కారు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు కుటుంబీకులకు సమాచారం ఇచ్చి ప్రయాణాలు సాగించాలని సూచించారు.