కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక టెంపో ట్రావెలర్, కెఎంఎఫ్ పాల వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం అర్సికేరే తాలుకా పరిధిలోని గాంధీనగర్ సమీపంలో జరిగింది.
మృతులు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు శనివారం రాత్రి 11 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మిల్క్ ట్యాంకర్, టెంపో ట్రావెలర్ మాత్రమే కాకుండా… ఆర్టీసీ బస్సు కూడా ప్రమాదంలో చిక్కుకున్నట్టు పేర్కొన్నారు.
మృతులంతా టెంపో ట్రావెలర్ లో ప్రయాణిస్తున్న వారే అని వెల్లడించారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ముగ్గురు ఆస్పత్రికి తరలించే మార్గంలో ప్రాణాలు విడిచారు.
గాయపడిన మరో 10 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని హాసన్ జిల్లా ఎస్పీ హరీ రామ్ శంకర్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.