గోవా- ముంబయి హైవే పై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి పై రాయగఢ జిల్లాలోని మంగాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ దుర్ఘటనలో 9మంది మరణించగా.. నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన బాలుడిని స్థానికులు హుటాహుటిన దవాఖానాకు తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలున్నారు. సమాచారం అందుకున్న గోరేగాం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.