MDCL: జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్, మరోవైపు శామీర్‌పేట వరకు మెట్రో నిర్మాణానికి సంబంధించి డీటెయిల్స్ పూర్తి చేసి కేంద్రానికి పంపినట్లుగా మెట్రో సంస్థ తెలిపింది. గత కొద్ది రోజులుగా కేంద్ర అనుమతి కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిర్మాణం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
BHPL: వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల పది రోజుల శిక్షణా శిబిరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ శిబిరంలో BHPL DCC అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పాల్గొన్నారు. నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల వ్యూహరచన, సోషల్ మీడియా నిర్వహణ వంటి అంశాలపై నిపుణుల శిక్షణ అందిస్తున్నట్లు కరుణాకర్ తెలిపారు.
KMM: భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించవద్దని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జీ. లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం KMM కలెక్టరేట్‌లో కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రైవేటీకరణ వల్ల కార్మికులకు దక్కే ప్రయోజనాలు తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.
MBNR: నవాబ్‌పేట్ మండల కేంద్రంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రాజు (17) అదృశ్యమయ్యాడు. ఈనెల 21న కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి డేవిడ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విక్రమ్ కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు చేపట్టారని తెలిపారు. పోలీసులు మిగిలిన వివరాలను పరిశీలిస్తున్నారు.
JN:చిప్పరాళ్లబండ తండాకు చెందిన నానునాయక్ తన భార్య దస్లీ మరణాన్ని తట్టుకోలేక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. ఆమె ఏడాదిన్నర క్రితం కన్నుమూసిన తర్వాత, ఆమె జ్ఞాపకమై నిలవాలని తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి ముసుగేసి ఉంచాడు. బతుకులోనూ, మరణంలోనూ ఆమెకు తోడుండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,510 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.21,400 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.36,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.18,300, ఎల్లో మిర్చి రూ.25వేలు పలికాయి. మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
GDWL: అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు న్యాయవాదులు రక్షణ చట్టం కోసం చేపట్టిన మహా పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. నేడు జడ్చర్ల నుంచి ప్రారంభమైన యాత్రను అలంపూర్ నియోజకవర్గ న్యాయవాదులు యాకోబు, నరసింహులు నిర్వహిస్తున్నారు. అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాత్ర సెక్రటేరియట్ వరకు కొనసాగనుంది.
ADB: ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో సిరికొండ, ఇచ్చోడ మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
NRPT: ఉట్కూర్ మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు తీరును జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మహిళలకు మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాధారణ ప్రసవాలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ను కోరారు.
HYD: పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రికి మొత్తం నాలుగు కోర్సులు మంజూరైనట్లు అధికారులు తెలియజేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ నాలుగు విభాగాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ కోర్సులు అనుమతి ఇచ్చింది. మాస్టర్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్సులకు అనుమతి లభించినట్లుగా డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. మొత్తం 16 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
HYD: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ మెడిసిన్ సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. న్యూరాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, పోస్ట్ ఆపరేషన్, ఇన్ఫెక్షన్, తదితర విభాగాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్‌లో మరింత మెరుగైన సేవలు అందించనున్నట్లుగా వివరించారు.
MDCL: రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసినట్లు యంత్రాంగం వెల్లడించింది. పరీక్షల నిర్వహణకు 151 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో 64,780 ఒకేషనల్ కోర్సులో 1,368, మంది, సెకండ్ ఇయర్ 67,792 జనరల్ విభాగం, ఒకేషనల్ విభాగంలో 1,258 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్‌లో కార్పొరేటర్ రాంబాబు మంగళవారం పర్యటించారు. ముందుగా డివిజన్‌లో ప్రతి కుటుంబాలతో వ్యాపారస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవభారత్ సెంటర్‌లోని డ్రైనేజ్ సమస్యలు, మంచినీటి సమస్యను త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు.
ASF: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు DIEO రాందాస్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఫస్ట్,సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ. 12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఒక్క నిమిషం నిబంధన అమలు ఉంటుందన్నారు.
BDK: అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురంలో శనిగరపు పుల్లయ్య మృతదేహం పొలం వద్ద మంగళవారం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికితే ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో మృతదేహం లభ్యమవడంతో విద్యుత్‌షాక్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.