NRML: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో 5కే రన్ నిర్వహించనున్నామని మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ తెలిపారు. సోమవారం ఉదయం 6:00 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కొమరం భీమ్ చౌరస్తా వరకు, మళ్లీ రిటర్న్ గవర్నమెంట్ కాలేజ్ వరకు 5 K రన్ మున్సిపాలిటీ కార్యాలయం ఆధ్వర్యంలో ఉంటుందని, అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.
HYD: రంజాన్ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్ని మసీదుల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ వెల్లడించారు. నిన్న జహనుమాలో ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు.
MDK: కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్, ఎలక్షన్ సూపరింటెండెంట్ గఫర్, ఎన్నికల సిబ్బందితో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాంను పరిశీలించారు.
PDPL: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.21.04 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023-24, 202 -25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు విడతల్లో ఈ నిధులు విడుదల చేశామన్నారు. ఇందులో రూ.5.73 కోట్లతో కరెంటు బిల్లులు, జీతాల చెల్లింపు, కార్యాలయపు ఖర్చులకు రూ.15.31 కోట్లు అభివృద్ధి పనులకు వినియోగించడం జరుగుతుందన్నారు.
MDCL: జిల్లాలో చికెన్ ధరలు షాకిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఆధివారం చెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. డ్రస్డ్ చికెన్ రూ. 260 నుంచి రూ. 270 వరకు, స్కిన్ లెస్ చికెన్ రూ. 290 నుంచి 300 వరకు పలుకుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు.
KNR: గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో డి.రాము హాజరయ్యారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్‌కు సంబంధించి గ్రామసభని నిర్వహించారు.
SRCL: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో, నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ తెలిపారు. సిరిసిల్ల 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల తో 12 రకాల న్యాయస్థానాలు సెల్లార్‌తో పాటు టెన్ ప్లస్ టు శైలిలో నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.
WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జలగం రఘువీర్ బీచ్ వాలీబాల్ రాష్ట్ర జట్టు ప్రధాన కోచ్‌గా వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఎంపికయ్యారు. ఈ విషయాన్ని శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయిని శైలజ తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు పుదుచ్చేరిలో జాతీయస్థాయి సీనియర్ బీచ్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయని ఆమె పేర్కొన్నారు.
ADB: రైతులకు రావలసిన పెండింగ్ రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం వెంటనే విడుదల చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్, MLA పాయల్ శంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట నష్టాల నుంచి రక్షణ కల్పించే ఫసల్ బీమా పంట బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
KMR: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి ఎల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
KMR: జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు DEO రాజు తెలిపారు. జిల్లాలో 13,154మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. మొత్తం 65 పరీక్ష కేంద్రాలు, చీఫ్ సూపరింటెండెంట్లు 65, డిపార్ట్‌మెంటల్ అధికారులు 65, అదనపు డిపార్ట్‌మెంటల్ అధికారులు 7, ఇన్విజిలేటర్లు 739 మందిని నియమించామన్నారు.హెల్ప్ లైన్ నంబర్ 9959670118ను కేటాయించామన్నారు.
NRPT: మద్దూర్ మండల కేంద్రంలోని ZPHS బాలికల, బాలుర పాఠశాలలను శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సందర్శించారు. అడ్మిషన్ డ్రైవ్‌లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మద్దూర్ జూనియర్ కళాశాలలో చేరాలని సూచించారు. కళాశాలలో MPC, BPC, CEC, ACE కోర్సులు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
NRPT: ఈవీఎంలు భద్రపరిచిన గోదాం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని అడిషనల్ కలెక్టర్ ఫణిందర్ రెడ్డి తెలిపారు. శనివారం నారాయణపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంలోని ఈవీఎంలను త్రైమాసిక తనిఖీలో భాగంగా అదనపు కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
NLG: గుర్రంపోడు మండలంలో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్న ఆటోలో పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి ఎరెడ్లగూడెం సమీపంలో ఆటోలో 25 బ్యాగుల్లో రవాణా అవుతున్న బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకన్న గౌడ్ తెలిపారు. అనంతరం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
NLG: మహిళల హక్కులు, వారి రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండలోని న్యాయ సేవా సదన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.