వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహించిన బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రలో ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ప్రదర్శనలు భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేశాయి.
HNK: హసన్ పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో మంగళవారం బాల్నే మొగిలి సొంత మరదల చేత దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొగిలిని గొడ్డలితో, కత్తులతో అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
RR: రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు టీసీజీఎస్-1694 ‘విశిష్ట’ వేరైటీ వేరుశనగ పై ఫీల్డ్ డే నిర్వహించారు. పూత దశలో తగిన నీరు, జిప్సం, జింక్ వినియోగంతో దిగుబడి పెరుగుతుందని డా. సంతోష్ కుమార్ సూచించారు. పంట విస్తీర్ణం, నాటే దూరం, సమతుల ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, యాంత్రీకరణపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.
NLG- తమ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో, నేడు ఆర్టీసీ కార్మికులు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా కార్మిక జేఏసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
WGL: ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం (మార్చి 4), సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం (మార్చి 5) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాల వారీగా WGL-12,166, HNK-38,600, JN-8,605, MHBD-8,287, BHPL-3,778, MLG-3,841 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.
HYD: బాల్య వివాహాల రహిత సమాజాన్ని నిర్మిద్దామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. బాల్యవివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనం ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. 18 ఏళ్లలోపు యువతులకు, 21 ఏళ్లలోపు యువకులకు పెళ్లి చేస్తే బాల్య వివాహం కిందికి వస్తుందన్నారు.
MDCL: KPHB 4వ ఫేజ్ దేవాలయ సముదాయాల ప్రధాన రహదారిలో ఓవైపు వాహనాలు, మరోవైపు గోడల పక్కన పాడుబడ్డ బండ్లు ఉండటంతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ఇబ్బంది పడుతున్నట్లుగా పలువురు వాహనదారులు వాపోయారు. దీంతో రోడ్డుపై ప్రయాణించడానికి చాలా కష్టంగా ఉంటుందని, ఇలాంటి వాటిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
MNCL: వేసవి దృష్ట్యా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారి రాజన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగిందని, అందుకు తగ్గట్లుగానే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పలు ఉపకేంద్రాల్లో పవర్ ట్రాన్స్ ఫార్మర్‌లు అందుబాటులోకి తెచ్చామన్నారు.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సోమవారం వచ్చిన ఆదాయం వివరాలను అధికారులు వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.79,862, ప్రసాదాల ద్వారా రూ.59,080, అన్నదానం ద్వారా రూ.14,044 ఆదాయం లభించింది. మొత్తంగా రూ.1,53,986 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ADB: మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ.. వేతనాలు రాక కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వేతనాలు చెల్లించని పక్షంలో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
RR: మహేశ్వరం PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలుయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న వాహనాన్ని తొలిగిస్తున్నారు.
ASF: పెంచికల్ పేట్ మండలం ఎల్లూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు నీలుగాయి మృతి చెందినట్లు FRO అనిల్ కుమార్ తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా SI అనిల్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ రాకేశ్ శవ పంచనామ నిర్వహించారు. అనంతరం ఖననం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
NRML: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా విజయరామారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో అంజనీదేవి సెలవుపై వెళ్లడంతో, నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పని చేసిన అనుభవం ఉండటంతో ఆలయ వ్యవహారాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
SRPT: జిల్లాకు ఎస్సారెస్పీ రెండోదశ ద్వారా ఇస్తున్న గోదావరి జలాలను సోమవారం సాయంత్రం పెంచారు.1200 క్యూసెక్కులు ఇస్తుండగా వాటిని 1613 క్యూసెక్కులకు పెంచారు. 4వ తడిగా వదులుతున్న గోదావరి జలాలను వారబందీ విధానంలో వారం రోజుల పాటు ఇవ్వనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణ, జాజిరెడ్డిగూడెం ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
NGKL: కుమ్మెర జాతరలో చిన్నారి మృతికి కారణమైన నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించామని మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. నిందితుల్లో సర్పంచ్ తుకారాం రెడ్డి సహా ఐదుగురు పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.