ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయం వద్ద నిర్మించిన శ్రీ సంత్ గాడ్గే బాబా మహరాజ్ మూర్తి ఆవిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ డోంగర్ గావ్ గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ లాల ఆదివారం హాజరయ్యారు. ఇమ్రాన్ లాలను సమాజ సభ్యులు సాంప్రదాయ పద్దతిలో సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.
SDPT: అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన మోటే అజయ్ గత 15 రోజుల క్రితం ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ఢీకొట్టడంతో ప్రాణాలను కోల్పోయాడు. తనతో కలిసి పదవ తరగతి చదువుకున్న జడ్.పి.హెచ్.ఎస్ అంతక పేట 2009 బ్యాచికి చెందిన తన తోటి స్నేహితులు అందరూ కలిసి దాదాపుగా లక్ష 40 వేల రూపాయలని తన కూతురి పేరుపై ఎల్ఐసిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
SRD: ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. జిల్లాలోని సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మెరుగైన పీఆర్‌సీని ప్రకటించాలని కోరారు. ప్రతి తరగతికి ఓ ఉపాధ్యాయున్ని నియమించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
MNCL: వచ్చే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
VKB: అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా SP స్నేహ మెహ్ర తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల సమావేశంలో వెల్లడించారు. అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగుతుందని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. అక్రమ వ్యాపారాలకు అండగా ఉన్న పోలీస్ సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఆదివారం కొంతం కిష్టమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. పేద కుటుంబానికి చెందిన కిష్టమ్మ కుటుంబ సభ్యులకు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తమ వంతు సహాయంగా రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.
VKB: దోమ మండలం గూడూరు గ్రామంలో గత 15 రోజులుగా నీళ్లు రాక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి రావాల్సిన మంచి నీటి బోరు మోటార్ పడైపోయిందని తెలిపారు. గ్రామస్థులు సర్పంచ్, సెక్రటరీ, వర్డ్ మెంబర్స్‌కు తెలియజేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు త్వరగా సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
VKB: కేంద్రంలోని అనంతగిరి హరిత రిసార్ట్లో DCC అధ్యక్షుల సమావేశం జరుగుతోంది. ఆ ప్రాంతంలో వివిధ కంపెనీల సిగ్నల్స్ రాకపోవడంతో DCC అధ్యక్షుడు ఆందోళన చెందుతున్నారు. అడవి ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడంతో ఎవరికి ఫోన్ చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం DCC అధ్యక్షుల మధ్య గుసగుసలాడుతోంది.
SRPT: తిరుమలగిరిలోని 2వ వార్డుకి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, మాజీ వార్డు మెంబర్ పులిగిల్ల యాదగిరి గుండెపోటుతో మరణించడంతో ఆదివారం ఆయన పార్థివదేహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకేపల్లి నరోత్తం రెడ్డి, జయచందర్, యాదగిరి, నరేష్ ఉన్నారు.
RR: చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అఖండ హారతి జాతర ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. జాతర ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు బారులు తీరడంతో వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో రద్దీగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
HYD: నగర వాసులకు అత్యంత నాణ్యతతో నీటి సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధమైంది. దీనికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటోమేటిక్ సోలార్ ఎలక్ట్రో క్లోరినేషన్ పద్ధతిని ఉపయోగించనున్నారు. వివిధ నదుల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసిన తర్వాత ఇంటింటికీ సరఫరా చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీని ద్వారా నాణ్యమైన నీటిని సరఫరా అవుతుందని అధికారులు అన్నారు.
MLG: వెంకటాపూర్ మండలం రామంజాపూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి నూతనంగా నిర్మించిన రైస్ మిల్‌ను ఇవాళ రాష్ట్ర మంత్రి సీతక్క రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రైస్ మిల్ వ్యాపారంలో రాణించి నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.
MBNR: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బ్రహ్మోత్సవాలలో భాగంగా దైవదర్శనానికి వెళ్తున్న రజక కుటుంబంపై దాడి చేసి పసిబిడ్డ మృతికి కారణమైన అగ్రవర్ణాలను కఠినంగా శిక్షించాలని పలువురు బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయానికి బాధ్యత వహించాలన్నారు.
WGL: గీసుకొండ మండలం శ్రీ కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మార్చి 9 వరకు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 3 నుంచి 7వరకు వరకు జరిగే ప్రధాన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే జాతరకు సమయం దగ్గర పడుతున్నా రూ.1.45 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.
BDK: దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగర్‌లో నూతన SVK ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ హాల్ పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఉపయోగపడే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.