ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో రామాంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో బీరువాలో ఉన్న రూ.2.30 లక్షల నగదు, నిత్యవసర సరుకులు మంటల్లో ఖాళీ పూర్తయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వాపోయాడు.
BPT: గుండె సమస్యతో బాధపడుతున్న ఇంకొల్లు మండలానికి చెందిన శిశువు చికిత్స కోసం మంగళవారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీ సాయం అందించారు. సొంత నిధుల నుంచి రూ. 50 వేలు ఇవ్వడంతోపాటు, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ. 3.02 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సహకారంతో గుంటూరులోని ఆసుపత్రిలో చిన్నారికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది.
TPT: తితిదే విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్చి 5న ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. దేవస్థానం పరిపాలన కార్యాలయ ఆవరణలో జరిగే ఈ సమావేశానికి విశ్రాంత ఉద్యోగులు హాజరుకావాలని ఆయన కోరారు.
కృష్ణా: మార్చి నెల పెన్షన్లను ఈనెల 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు మొవ్వ MPDO డి. సుహాసిని తెలిపారు. ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28వ తేదీన ముందుగానే అందజేయనున్నట్లు ఆమె చెప్పారు. NTR భరోసా పింఛన్ పథకం కింద మండలంలో 8,315 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 3,59,83,500 నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
VSP: రాంబిల్లి మండలంలో గ్రీన్ ఫీల్డ్ లిథియం కంపెనీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఏర్పాటు చేసే బాలాజీ యాక్షన్ బిల్డ్ వేస్‌కు ప్రోత్సాహకాలు అందిస్తారు. రూ.8,175 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కంపెనీలో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
AP: అనంతపురంలో విజిలెన్స్ అహార తనిఖీ విభాగం అధికారులు మూడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. శ్రీకంఠం కూడలి కల్యాణదుర్గం బైపాస్ రామ్‌నగర్‌లో ప్రైవేట్ వ్యాపారుల నుంచి పాల నమూనాలు సేకరించారు. విశాఖ అక్కయ్యపాలెం, మద్దిలపాలెంలోని పలు మిల్క్ ప్రొడక్ట్ సంస్థల్లో ఫుడ్ ఇన్‌స్ఫెక్టర్, అధికారులు సోదాలు చేశారు. పాలు, పాల ఉత్పత్తుల నమూనాలను ల్యాబ్‌లకు పంపించారు.
WNP: పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తుండగా బూడిదపాడు వాగులో నుంచి 2 ఇసుక ట్రాక్టర్లు బయటకు రావడం జరిగింది. వాటి పర్మిషన్ అడగగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో అట్టి ట్రాక్టర్లను,డ్రైవర్ వెంకటయ్య,శేఖర్ అనే 2 వ్యక్తుల పైనా కేసు నమోదు చేశారు.స్టేషన్కు తీసుకొచ్చి కేసు నమోదు చేసి అట్టి రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
SRCL: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు బాబుకు అంతర్జాతీయ పారా వాలీబాల్ కోచ్ అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్న 2026 ఆసియా పారా గేమ్స్ కోసం భారత జట్టును ఎంపిక చేసే సాంకేతిక పరిశీలకులు, ఎంపిక కమిటీ సభ్యుడిగా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఆయన్ను నామినేట్ చేసింది.
నల్లగొండ: జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ రాజశేఖర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని భాస్కరబాయి గ్రామంలో పశు సంవర్ధక శాఖ, పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని పరిశీలించారు.
PDPL: రామగుండం సింగరేణి 11వ బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐలయ్య అనే కోల్ కట్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గనిలో బ్లాస్టింగ్ అనంతరం అకస్మాత్తుగా సైడ్ ఫాల్ (బొగ్గు పెల్లలు) పడడంతో ఆయన నడుము, కుడి కాలుకు గాయాలయ్యాయి. బాధితుడిని జీడీకే సింగరేణి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
HYD: హైదరాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు గత మూడు సంవత్సరాల స్కాలర్షిప్‌లు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల రూ.750 చొప్పున 10 నెలలకు రూ.7,500 ఇవ్వాల్సి ఉండగా నిధులు విడుదల కాలేదని తెలిపారు. పెండింగ్ మొత్తాన్ని వెంటనే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఓటీటీ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel, Jugnoo అనే ఐదు OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, గతంలోనూ పలు ఓటీటీ సంస్థలను కేంద్రం బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.
NTR: ఇబ్రహీంపట్నం మండలం ములపాడు గ్రామంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మాజీమంత్రి యోగి రమేష్ మాట్లాడుతూ.. వైసీపీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసి, పార్టీని గ్రామస్థాయి వరకు మరింత శక్తివంతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
SRPT: విద్యుదాఘాతంతో గేదె మృతిచెందిన ఘటన చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేతు సోమయ్య చారికి చెందిన గేదెను ఇంటి నుంచి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ తీగ తగిలి గేదె అక్కడిక క్కడే మృతిచెందింది.
HYD నగరానికి జంట జలాశయాలు మంచినీటి వరప్రదాయినిగా నిలుస్తున్నాయి. 1920 ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ నుంచి ఆసిఫ్ నగర్ వరకు సుమారు 16 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించారు. కాలక్రమేణా మరమ్మత్తులు పెరగడంతో లీకేజీలు అధికమవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.280 కోట్ల వ్యయంతో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.