నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ నగర పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక వావిలేటిపాడు, ధనలక్ష్మిపురం ప్రాంతాలలో వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ల పరిధిలోని వివిధ భవనాలకు సంబంధించి అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేశారు. భవనాలకు కొలతలు వేసి సరిపోల్చారు.
AP: గుంటూరు ఛానల్ కట్టలు దెబ్బతిన్నాయని మండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తావించారు. రూ.369 కోట్లతో పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఛానల్ పొడిగింపునకు ప్రభుత్వం రూ.285 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫేజ్-1 కింద అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
‘కార్తికేయ-2’ షూటింగ్‌లో జరిగిన ఒక విషాదకర ఘటనను నటి అనుపమ పరమేశ్వరన్ గుర్తు చేసుకుంది. సెట్‌లో తాను ఎంతో ఇష్టంగా ఆడుకున్న మేకపిల్లనే, యూనిట్ సభ్యులు మటన్ బిర్యానీగా వడ్డించారని తెలిపింది. ఆ విషయం తెలియగానే అక్కడికక్కడే వాంతులు చేసుకున్నానని, అప్పటి నుంచి మటన్ తినడం మానేశానని ఆవేదన వ్యక్తం చేసింది.
PDPL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని UBI మేనేజర్ శివ బాలు తెలిపారు. మంగళవారం నంది మేడారంలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో CFL కౌన్సిలర్స్ సుజాత, జ్యోతి పాల్గొన్నారు.
RR: మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కేబుల్ బ్రిడ్జి నుంచి ఐటీసీ కోహినూర్‌కు వెళ్లే మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
WNP: పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా, సమయాలకు అనుగుణంగా బస్సులను నడపాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
HYD: రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. నానక్‌రామ్‌గూడ రోటరీ నుంచి గచ్చిబౌలి వైపు, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పీక్ అవర్స్ సమయంలో మరింత ఆలస్యం ఉండే అవకాశం ఉంది. వాహనదారులు వీలైనంతవరకు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని లేదా అదనపు ప్రయాణ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలన్నారు.
KMR: కామారెడ్డి నుంచి రాజంపేట, గుండారం మీదుగా మెదక్‌కు ఆర్టీసీ బస్సు సర్వీసు పునఃప్రారంభమైంది. గతంలో నిలిపివేసిన ఈ సర్వీసు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు డీఎం దినేశ్ కుమార్‌కు విన్నవించారు. అధికారుల సానుకూల స్పందనతో బస్సు తిరిగి అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పాత మార్గంలోనే బస్సు నడపాలని నిర్ణయించారు.
BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరగాల్సిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం శనివారానికి వాయిదా పడింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అత్యవసర క్యాబినెట్ సమావేశం ఉండటంతో ఈ మార్పు చేసినట్లు స్థానిక టీడీపీ నాయకులు మంగళవారం వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని వారు కోరారు.
NZB: రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గడ్కోల్ GP పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ సండ్ర లతా శంకర్, ఉప సర్పంచ్ రొక్కం సంపత్ రెడ్డి తెలిపారు. సిరికొండలోని గడ్కోల్గ్ గ్రామంలో నూతనంగా బోరు బావి తవ్వకం పనులను ప్రారంభించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
AP: కఠినతర నిబంధనలు మార్చిందెవరు? బోర్డు మార్చినప్పుడు ఛైర్మన్‌గా ఉన్నది వైవీ సుబ్బారెడ్డి కాదా అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. రోజుకు 4 లక్షల లీటర్ల సామర్థ్యం నిబంధనను తీసేశారని, రూ.250 కోట్ల టర్నోవర్‌ను రూ.150 కోట్లకు తీసుకొచ్చారన్నారు. డెయిరీ అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి తీసుకొచ్చారని, తమకు కావాల్సిన వ్యాపారులకు టెండర్లు ఇవ్వడానికే అన్నారు.
JGL: ప్రముఖ పుణ్య క్షేత్రం మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే కొండకు చేరుకుంటున్న భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. దీంతో ఉప ఆలయాలైన బేతాళ, రామాలయ ఆలయాల్లోను భక్తుల సందడి నెలకొంది.
MDK: చిలిపిచేడ్ మండలంలోని అజ్జమరి, గంగారం గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. తహసీల్దార్ సహదేవ్, ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో గంగారంలో 12, అజ్జమరిలో 16 డంపులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఇసుకను ఎవరైనా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
NRPT: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ కోసం క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. మొదటి, రెండో దశ ప్రాజెక్టులకు, డిస్ట్రిబ్యూటర్ల భూ సేకరణకు రూ.1,275 కోట్లు కేటాయించనుంది. మంత్రివర్గ ఆమోదంతో పథకం పనుల్లో వేగం పెరుగుతుందని అంచనా.
BPT: తిరుమల లడ్డూ, హెరిటేజ్ అంశాలపై శాసన మండలిలో చర్చించేందుకు సీఎం చంద్రబాబు సాహసం చేయలేకపోయారని మంగళవారం బాపట్ల వైసీపీ ఇంఛార్జ్ మేరుగ నాగార్జున ఆరోపించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను వరుసగా తిరస్కరిస్తూ కూటమి నేతలు చర్చ నుంచి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఏకపక్షంగా చర్చించి ఈ వ్యవహారాన్ని ముగించాలనుకోవడం పిరికిపంద చర్య అన్నారు.