VSP: సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్యలకు తక్షణ స్పందనకోసమే అని చెప్పారు.
ADB: కడెం మండలం దోస్త్ నగర్ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆదిలాబాద్ బొక్కలగూడకు చెందిన సయ్యద్ నసీరుద్దీన్‌గా గుర్తించారు. అతను మంచిర్యాలలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ నిర్మల్‌లో నివాసం ఉంటున్నారు.
KRNL: కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుడు షేక్ షాకీర్, అతని భార్య షేక్ సలీమాకు ఆదివారం కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి రూ. 4,95,699/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. పసుపుల ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు CM చంద్రబాబు , KDCC ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
HYD: అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్‌సుఖ్ నగర్‌లోని ఆర్టీసీ హైదరాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. మార్చి 1వ తేదీన రాత్రి 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. తిరిగి నాలుగవ తేదీన బస్సు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. భక్తులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు.
SKLM: ఇవాళ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో సీసీ కెమెరాల నిఘా నడుమ పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్‌ఐవో సురేష్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కాగా, 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు.
AKP: మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. ఆదివారం అనకాపల్లి పూడిమడక రోడ్డులో ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ధృవతారగా వెలిగిన ఎన్టీఆర్ కారణజన్ములని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలన్నారు.
MDK: టేక్మాల్ మండలం బోడగట్టు సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కమ్మరికత్త, సూరంపల్లి, వేల్పూగొండ తదితర గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ ఉదయ్ భాస్కర్, ఏడీఈ వెంకటేశ్వరరావు తెలిపారు వినియోగదారులు గమనించి సహాకరించాలని కోరారు.
KNR: కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆశలకు గండి పడినట్లు తెలుస్తోంది. ఆదివారం మేయర్ శ్రీనివాస్ తన ఛాంబర్లోకి అడుగుపెట్టగా, అదే సమయంలో డిప్యూటీ మేయర్‌కు కూడా ఛాంబర్ కేటాయిస్తారని భావించినా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకోలేదు. బీజేపీయేతర పార్టీల నాయకుల ఫిర్యాదు మేరకు ఛాంబర్ అలాట్ నిలిచిపోయింది.
JGL: మల్యాల మండలం బల్వంతపూర్‌లో కొను బక్కయ్య (53) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. కాగా, మృతుడు కొంతకాలంగా మానసిక వేదనను తట్టుకోలేక పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో మరోమారు ఆదివారం గ్రామంలోని ఓ హార్వెస్టర్‌కు నైలన్ తాడుతో ఉరి వేసుకున్నట్లు మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
SRCL: ముస్తాబాద్ మండలం చీకోడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పర్శ శ్రావణి సీఎం కప్ జిల్లా స్థాయి రన్నింగ్ పోటీల్లో సత్తా చాటింది. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా కోచ్ రమేశ్, పాఠశాల ప్రిన్సిపల్, MEO నిమ్మల రాజిరెడ్డి, సర్పంచ్ బొమ్మేన ఆంజనేయులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
కోనసీమ: ఊపిరి ఉన్నంతవరకు, అధికారం ఉన్నా లేకున్నా సమాజ సేవ చేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలు పునరుద్ఘాటించారు. ఆదివారం సాయంత్రం కె.గంగవరం మండల శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో గజమాలలతో ఘనంగా సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ సన్మానం తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు.
ATP: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా తెలిపారు. పేటీఎం సంస్థ అనంతపురంలోని పంగల్ రోడ్డులోని టీటీడీసీ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోందన్నారు. పదవ తరగతి నుంచి పైచదువులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 10,57,899 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1.537 కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష ఉ.9-మ.12 గంటల మధ్య జరగనుండగా.. విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ALL THE BEST STUDENTS!
KDP: బద్వేలు మండల MRO కార్యాలయంలో నేడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు MRO ఉదయ్ భాస్కర్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు RDO చంద్రమోహన్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు.
కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్,జాయింట్ అధితి సింగ్‌తో సహా జిల్లాలోని ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.