KRNL: అసంఘటిత కార్మికుల సమస్యలను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. విపత్తు వేళల్లో కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ‘ఈ-శ్రామ్’ పథకాన్ని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కార్మిక నిధులను మళ్లించిందని ఎమ్మెల ఆరోపించారు. పేదలు ఎక్కడైనా రేషన్ పొందే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
VSP: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల (PGRS) పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పదిమంది అధికారులను హెచ్చరిస్తూ, “పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అన్నమయ్య: పాత రాయచోటిలో పిచ్చి కుక్క హల్‌చల్. సోమవారం కుక్క దాడిలో ఇద్దరికీ గాయాలు కాగా, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు.గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.వీధి కుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. టి వీరాపురం వద్ద పైప్ లైన్ లీకేజీ కారణంగా మరమ్మత్తులో భాగంగా 24, 25వ తేదీలలో నీటి సరఫరా ఉండదని తెలిపారు. కావున రెండు రోజులపాటు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని కోరారు.
CTR: పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశాయి. మొదటి విడతగా నగరి మున్సిపాలిటీకి 454 ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తమ కల నెరవేరుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో ఘంటసాల మండలం పూషడం గ్రామ ప్రధాన రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రూ.కోటీ నలభై లక్షలతో పల్లె పండుగ కార్యక్రమం పురస్కరించుకొని జాతీయ రహదారి-216 నుంచి పూషడం వరకూ మూడు కిలోమీటర్లు ప్రధాన రహదారిలో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
GNTR: పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ప్రత్తిపాడు సర్పంచ్ వసవర్తి రమాదేవి సోమవారం పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గతంలో సుమారు రూ.14 లక్షల బిల్లులను డ్రా చేసి గోల్‌మాల్ చేశారని ఆమె ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఎలా డ్రా చేశారో అధికారులు సమాధానం చెప్పాలని, కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
BPT: అద్దంకి మండలం ద్వారకా నగర్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంసన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
SKLM: గల్లీ నుండి డిల్లీ వరకు ఎర్రన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకమైనదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తన తండ్రి దివంగత ఎర్రంనాయుడు 69వ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు కార్యక్రమాలలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం నిమ్మాడలోని ఎర్రన్న ఘాట్‌లో కుటుంబ సభ్యులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
VZM: రాబోయే ఏ ఎన్నికల్లోనైనా వైసీపీ ఘనవిజయం సాధించి, జెండా ఎగరవేయడం ఖాయమని విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం భీమిలి మండలం అవనాం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీను అధ్యక్షతన జరిగిన మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు.
SKLM: ముద్దాయిలు జైలులో సత్ప్రవర్తనతో మెలగాలని, శిక్షా కాలం ముగిసిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. సోమవారం అంపోలులోని జిల్లా కారాగారాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
VSP: అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వెంటనే వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. హామీల అమలుకోసం సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. 18 నెలలు గడిచినా చర్యలు లేవన్నారు. 1972 యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ, సంక్షేమ పథకాలు, వేసవి సెలవులు, అదనపు పనిభారం తగ్గింపు కోరారు.
ASR: దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ హిందూ భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు దెబ్బతీస్తున్నారని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. ఈమేరకు సోమవారం అనంతగిరి మండలం గుమ్మా పంచాయితీలో శ్రావణ్ కుమార్ విలేకర్లతో మాట్లాడారు. టీటీడీలో వైసీపీ హాయాంలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
కోనసీమ: కర్నూలు జిల్లాలో న్యాయవాది పవన్ కుమార్‌పై జరిగిన దాడిని ఆలమూరు బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. కర్నూలు పోలీస్ స్టేషన్లో సిఐ విక్రమసింహ న్యాయవాది పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి చేసిన ఘటన న్యాయవర్గాలను కలిచివేసిందని వారు పేర్కొన్నారు. సోమవారం న్యాయవాది వేమగిరి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలమూరు కోర్టులో విధులు బహిష్కరించారు.
SKLM: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ‘ సేవ్ పునర్విక ‘అంటూ వినిపిస్తోంది. కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడటానికి సోషల్ మీడియా మొత్తం ఏకమైంది. రూ.16కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ కోసం ఫండ్ రైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈమేరకు మందస మండలానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యువత స్పందించారు. పునర్విక కోసం విరాళాలు సేకరణ సోమవారం ప్రారంభించారు.