PLD: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నూతన నిర్మాణానికి భక్తులు విరాళాలతో ముందుకు వస్తున్నారు. మంగళవారం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అలపర్తి వెంకటేశ్వర్లు, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు రూ.1,01,116 నగదును ఆలయ ఈవో నలబోతు మాధవిదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కృష్ణా: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కృష్ణా డెల్టాలోని జల వనరుల శాఖ ఔట్ సోర్సింగ్ లస్కర్లు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈఅవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును కలిసి వినతిపత్రం అందచేశారు. తమకు ఏడాదిలో 8-10 నెలలు కాకుండా 12నెలలకూ జీతాలు ఇవ్వాలని కోరారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని కోరారు. ప్రభుత్వం జీతాలు సకాలంలో ఇవ్వాలని కోరారు.
PPM: వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రధానమని, అందుకు తగిన విధంగానిర్మాణం చేపట్టాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మౌలిక వసతులతో పాటు గాలి వెలుతురు ఉండాలని తేల్చి చెప్పారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
E.G: గోకవరం మండలంలోని కొత్తపల్లి, బొమ్మల దొడ్డి హౌసింగ్ లేఅవుట్లను జిల్లా హౌసింగ్ పీడీ నాది బుజ్జి మంగళవారం సందర్శించారు. రూఫ్ లెవల్‌లో ఆరు, బేస్‌మెంట్ లెవల్‌లో 102 ఇళ్లు ఉన్నట్లు పీడీ తెలిపారు. నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు. బిల్లులు సకాలంలో అప్‌లోడ్ చేస్తే ఐదు రోజుల్లోనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
AKP: గొలుగొండ(మం) నర్సింగబిల్లిలో తలుపులమ్మ తల్లి పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పెద్దలు తెలిపారు.
GNTR: గుంటూరు డొంక రోడ్డులోని వల్లూరివారితోట, కార్మిక శాఖకు చెందిన ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేసే అంశాన్ని మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ మంగళవారం పరిశీలించారు. తమ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కు నిర్మించాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. అనంతరం, అస్తవ్యస్తంగా ఉన్న 5వ లైన్‌ను కూడా కమిషనర్ స్వయంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
W.G: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంకెం సీతారాం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో జరుగుతున్న ఏఐసీసీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఇరువురు నేతలకు జ్ఞాపికలను అందజేశారు.
ELR: కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో ఏకీకృత కుటుంబ సర్వే చేస్తున్న సచివాలయ సిబ్బందిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 21న సర్వే చేస్తుండగా.. మా వివరాలు మీకెందుకు చెప్పాలని గ్రామస్థుడు బలే సాయికుమార్ తమపై దాడిచేసినట్లు సిబ్బంది టి.సురేశ్, సీహెచ్ గోపాలకృష్ణలు ఆరోపించారు. ఈ మేరకు సాయిపై రూరల్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
నెల్లూరు రూరల్ 24వ డివిజన్ కనుపర్తిపాడులో రూ.22.50 లక్షలతో ఎస్టీ కాలనీ శ్మశానానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. ఈ పనులను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడమని చెప్పారు.
అనంతపురం డీఈఐసీ కేంద్రాన్ని ప్రోగ్రాం అధికారి డా. విష్ణుమూర్తి సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షించారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు డా.నాగ శశిభూషణ రెడ్డి సమక్షంలో మాత్రలు అందజేశారు. అలాగే 28 మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
CTR: అరగొండ ఏ.గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉన్నందున పింఛన్ మంజూరు చేయాలని ఆయన భార్య లోకేశ్వరి కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శస్త్రచికిత్స అనంతరం భర్త చేతులు, కాళ్లు పనిచేయక కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని ఆమె కోరారు.
NTR: పాల కేంద్రాల్లో పాలు కల్తీ జరగకుండా, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలపై పశుసంవర్ధక శాఖ వైద్యుడు అభిలాష్ మంగళవారం తిరువూరులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు కల్తీయా కాదా అని గుర్తించే విధానాలపై పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. కల్తీ పాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.
KRNL: ఎమ్మిగనూరులోని సంజీవయ్య నగర్ మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్లు, కాలువలు, నీటి సరఫరాను పరిశీలించారు. ఆయా వార్డులలోని సమస్యలపై ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. డీఈఈ రాజు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఏఈ ప్రతాప్, సిబ్బంది ఉన్నారు.
E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అనపర్తి శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా BJP జిల్లా కార్యదర్శి హేమ తులసి విద్యార్థిని, విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా త్వరలో బహుమతులు అందజేస్తామన్నారు.
VSP: క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసిన భారీ కుంభకోణం విశాఖలో వెలుగుచూసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రవి కిరణ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితులు సీపీకి నేరుగా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.