బాపట్ల: చుండూరు మండలం ఆలపాడుకు చెందిన నాగేశ్వరరావు అపరాల నూర్పిడి యంత్రంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు చేయి తెగి తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు వెంటనే తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆర్థోపెడిక్ వైద్యుడు హనుమంతరావు బృందం శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 44 హైవేపై బుధవారం అర్ధరాత్రి కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రకాశం: ఒంగోలు కూటమిలో కుంపటి రాజుకుంటుందా అనే సందేహం ప్రజల్లో మొదలైంది. YCP నుంచి బాలినేని జనసేనలోకి వెళ్లగా.. అప్పటి నుంచి ఆయనపై అవాకులు, చవాకులు పేలుతూనే ఉన్నాయి. MLA దామచర్ల కూటమిలో ఉండగా.. వాస్తవానికి వీరిద్దరు కూటమిలో ఉన్నా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
NDL: నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70 ఏళ్లకే పరిమితమవుతుంటే, పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ఆహారం తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
ELR: ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జలసూత్రం రంగారావు (57) మామిడి కొమ్మలు కోయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు భారీ కొమ్మ పైనపడి మృత్యువాతపడ్డాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లగా ఈ దుర్గటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సత్యసాయి జిల్లాలోని దివ్యాంగులకు ఈనెల 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాలోని ధర్మవరంలో 7,150 మంది, కదిరిలో 6,081, పుట్టపర్తిలో 5,983, పెనుగొండలో 5,027 మంది లబ్ధిదారులు ఉన్నారు. హిందూపురం, మడకశిర, రాప్తాడు డివిజన్ల పరిధిలోని వికలాంగులకు సైతం ఈ పథకం వర్తిస్తుంది.
ASR: జిల్లాలోని 11 మండలాలకు చెందిన 120 మంది నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు రేపటి నుంచి 45 రోజులపాటు డ్రైవింగ్‌పై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో దీనికి సంబందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
కడప జిల్లాలో శనగ పంట ప్రొక్యూర్‌మెంట్ బాధ్యత మార్క్ ఫెడ్ తీసుకుంది. జిల్లాలో 21 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ వద్ద ఉద్యోగులు లేక, DCMSను ఏజెన్సీగా నియమించుకుంది. DCMS వద్ద కూడా సిబ్బంది లేక, 21 ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో నలుగురు DCMS ఉద్యోగులను సూపర్వైజర్లుగా పెట్టారు. 21 మంది ప్రైవేట్ వారిని ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టారు.
CTR: జిల్లాలో పరీక్షల భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్తూరు-2 టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. నగరంలోని టెలిఫోన్ కాలనీలో ఉన్న రజియా టెన్త్ క్లాస్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. త్వరలో టెన్త్ క్లాస్ పరీక్షల భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
VZM: డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం బాడంగి మండలంలో ఎత్తుకానా సమీపంలో నాబార్డ్ సహకారంతో నిర్వహిస్తున్న FCC బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు బెల్లం తయారీలో సాంకేతిక సలహాలు ఇవ్వడంలో DCCB ఎప్పుడు ముందు ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సమీపంలోని దీక్షా మహిళా వెల్‌ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని సందర్శించి పలు సూచనలు చేసారు.
TPT: శ్రీదేవి కాంప్లెక్స్ గేట్ వద్ద ఈస్ట్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఇంద్రావత్ పవన్ కుమార్ నాయక్, ఎరగ అశోక్ ఉన్నారు. వీరు శ్రీనివాసం, విష్ణునివాసం, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తుల నుంచి సెల్ ఫోన్లు, నగదు, బంగారు నగలు అపహరిస్తూ దొంగతనాలు చేస్తున్నారు. పోలీసులు వారి నుంచి రూ. 2.5 లక్షల విలువైన 14 ఫోన్లు, రూ. 3 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
NLR: శ్రీతల్పగిరి రంగనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవీ భూదేవి సమేత రంగనాథ స్వామివారి కళ్యాణం బుధవారం నిర్వహించారు. TTD తరఫున స్వామివారికి దేవాదాయ శాఖ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
E.G: కడియం మండలంలో ఓ సంస్థ చెల్లించాల్సిన రూ. 1.47 కోట్ల ఇంటి పన్ను బకాయిలను వెంటనే కట్టాలని ఎంపీడీవో కె. రమేశ్ కోరారు. బుధవారం అధికారుల బృందం సంస్థ ప్రతినిధులను కలిసి పన్ను వివరాలను అందజేశారు. గ్రామపంచాయతీకి రావాల్సిన ఈ భారీ నిధులను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
KKD: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంతర్ కళాశాలల అథ్లెటిక్ పోటీలు గురువారం నుంచి రెండురోజులపాటు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో జరగనున్నాయి. ప్రిన్సిపల్ డా.ఎ. విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగే ప్రారంభ వేడుకులకు ముఖ్యఅతిథిగా మాజీ డీఎంఈ డా. డీఎస్ఎల్ఎన్ నరసింహం హాజరుకానున్నారు.
NDL: బనగానపల్లె మండల పరిధిలోని నందివర్గంలో శ్రీ అల్లా బకాష్ మియా స్వామి ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.16,016, రెండవ బహుమతిగా రూ.12,016, మూడవ బహుమతిగా రూ.8,016, నాలుగో బహుమతిగా రూ.4,016 అందజేయనున్నట్లు పేర్కొన్నారు.