VSP: విశాఖలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీవీఎంసీ ‘ప్రాజెక్టు సారథి’ని అమల్లోకి తెచ్చింది. 101 సిగ్నళ్లను సిటీ ఆపరేషన్ సెంటర్‌కు అనుసంధానిస్తూ అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నారు. 90 కీలక జంక్షన్లలో ఏఐ ఆధారిత ఐటీఎంఎస్ ఏర్పాటు చేసి హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంప్ వంటి ఉల్లంఘనలను గుర్తించి ఆటోమేటిక్‌గా చలానాలు పంపించనున్నాయి.
KDP: ప్రొద్దుటూరు రాజీవ్ గాంధీ నేషనల్ ఏకో పార్క్, రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన అటవీ పరిరక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని జాతీయ పార్కు, రక్షిత అడవి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల చుట్టూ ఏకో-సెన్సిటివ్ జోన్ అమలుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.
కృష్ణా: నందివాడ విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. నూతన ఆర్‌డీఎస్‌ఎస్ విద్యుత్తు లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు తుమ్మలపల్లి, తమిరిశ గ్రామాలతో పాటు నందివాడ ప్రాంతంలో సరఫరా ఉండదని వెల్లడించారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు బెల్లం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. బుధవారం వేకువ జామునే స్వామి మూల విరాట్‌కు పంచామృత, రుద్రాభిషేకం వివిధ అభిషేకాలు చేపట్టి బెల్లంతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామివారి విశేష అలంకరణను భక్తులు దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.
NDL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షౌరాణ్ పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. దాదాపు 1200 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ బందోబస్త్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాస్లు ఉన్నవారు మాత్రమే సీఎం కార్యక్రమంలో పాల్గొనాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
AKP: కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ర్యాంపు, వీల్ఫైర్ వంటి మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. తోటకూరపాలెం నుంచి 20 కి.మీ. దూరం ప్రయాణించి వచ్చిన గూనూరు ఆదిలక్ష్మిని ఆమె తల్లి వెంకటలక్ష్మి ఎత్తుకొని పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లారు. మెట్లు ఎక్కాల్సి రావడంతో మరింత ఇబ్బంది పడింది.
SKLM: శ్రీకాకుళంలోని డయేరియా కేసులు 76కి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. బాధితుల కోసం రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రభావిత కాలనీల్లో 50 సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాయి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తాగునీరు మరిగించి తాగాలని వైద్యులు సూచించారు.
కాకినాడ సాంబమూర్తి నగర్‌లోని ESI ఆసుపత్రి మంగళవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా మారింది. సంస్థ 75 వసంతాల వేడుకలతో పాటు దేశంలోని వంద పడకల ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలకు గాను రెండో స్థానం దక్కించుకున్న సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి సాధించిన ఈ గుర్తింపు పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ATP: పామిడి పట్టణంలోని ప్రముఖ శైవవక్షేత్రమైన భోగేశ్వరాలయం, లక్ష్మీ చెన్నకేశవ ఆలయాల హుండీ కానుకలు బుధవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో క్రిష్ణయ్య మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ఉంటుందన్నారు. లెక్కింపులో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా పంచ, పైపంచ ధరించి పాల్గొనాలని ఆయన కోరారు.
NLR: వలేటివారిపాలెం – చుండి మధ్య 167బి జాతీయ రహదారి పక్కనే ఉన్న జనార్ధన స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయ పక్కన ఉన్న మండపంలో సుమారు 10 అడుగుల లోతున గుంత తీయడం స్థానికంగా కలకలం రేపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
PPM: మక్కువ మండలం వెంకంపేట వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో డ్రైవర్ ముఖంపై తీవ్ర గాయం కాగా, మరొకరికి ఛాతీ మీద గాయమైంది. వీరు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ..10 కేజీల వెండి, 42 సవర్ల బంగారం, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సత్తెనపల్లి రాకేష్, ఆశీర్వాదంపై గతంలో 34 కేసులు ఉన్నాయని, ఈ కేసులో 8మందిని గుర్తించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
W.G: పాము, కుక్క కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మాట్లాడుతూ.. యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు 420, పాము కాటు వ్యాక్సిన్ 400 అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.