VZM: చీపురుపల్లి ప్రాంతీయ హాస్పిటల్‌ను గురువారం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సందర్శించారు. ఈనెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవి టీకా వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి ఆరోజున చంద్రబాబు నాయుడు హాస్పిటల్ సందర్శించనున్నారు. అన్ని ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
NLR: బుచ్చి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వాన్ని స్థానిక ప్రజలు, కార్యకర్తలు నమోదు చేయించారు. ఇప్పటివరకు 200 సభ్యత్వాలు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతంపై కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.
W.G: ఆకివీడు తాళ్లకోడు కాలనీలో సమస్యలను పరిశీలించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. కాలనీలో రోడ్లు సక్రమంగా లేవని, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేదని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీని ఆకివీడు నగర పంచాయతీలో చేర్చి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఎం నాయకులు శ్రీనివాస్, బలరాం, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
GNTR: ఆయేషా మీరా అస్థికలను సీబీఐ తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. కేసులో దర్యాప్తు విఫలమైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆశాభావం తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి డిసెంబర్ 27ను సంస్మరణ దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: మార్చి 8 వ తేదీన అమలాపురంలోని కామనగరువు డిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆంధ్ర, కోనసీమ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌లను జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, ఏపీసీ మమ్మీ గురువారం ఆవిష్కరించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు రూ.లక్ష నగదు బహుమతి, సర్టిఫికెట్‌లు అందజేస్తామన్నారు.
NLR: బుచ్చి పట్టణం బేల్దార్ పాళెం లోని పోలేరమ్మ తల్లి ఆలయం పునఃనిర్మాణం జరిగింది. మూడు రోజులు గా మహాకుభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా చివరి రోజు 108 కళాశాలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పోతురాజుస్వామి విగ్రహం ప్రతిష్టించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
SS: ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. దేవాలయ భక్త సేవా మండలి, అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
PLD: నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా తిరుగుతున్న ఒక బాలుడిని స్థానికులు గమనించి గురువారం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ బాలుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో భద్రంగా ఉన్నాడని సీఐ ఫిరోజ్ తెలిపారు. బాలుడు వివరాలు చెప్పలేకపోతున్నాడని, ఈ బాలుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.
KRNL: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణానికి టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.
NDL: కొత్తపల్లి మండలం ఎర్ర మఠంకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు వెంకట్ రెడ్డి క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలిసిన బైరెడ్డి వెంకట్ రెడ్డి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
W.G: నరసాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెవెన్యూ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల శిబిరాన్ని నరసాపురం ఆర్డీవో దాసిరాజు గురువారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు.
KDP: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల డిమాండ్లు సమంజసమని, వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7,000 మాత్రమే వేతనం ఇవ్వడం అన్యాయమన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.
E.G: రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడి వర్కర్లు & హెల్పర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కొనసాగాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ద్రోహం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యూటీ అమలు చేయాలని, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్ లు ఇవ్వాలన్నారు.
VZM: వేపాడ మండలం దబ్బిరాజుపేట ఎంపీపీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి పీ బాల భాస్కరరావు గురువారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. ఎఫ్ ఎల్ ఎన్ మెటీరియల్ వినియోగించే తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారిలోని భాకరాపేట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలై కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.