Stock Market: ఫెడ్ వడ్డీ రేట్ల దెబ్బ స్టాక్ మార్కెట్లపై (Stock Market) స్పష్టంగా కనిపించింది. ఉదయం సెషన్ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఫెడ్ వడ్డీరేట్లు పెంచిందనే వార్తలతో నష్టాలను మూటగట్టుకున్నాయి. సెషన్ ముగిసేసరికి భారీ నష్టాలను నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజీ 440 పాయింట్లు నష్టపోయి 66,267 పాయింట్లకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ 118 పాయింట్లు నష్టపోయి 19,660 పాయింట్లకు చేరింది.
సిప్లా, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలను ఆర్జించాయి. సిప్లా షేర్ 10 శాతం పెరిగింది. ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, టాటా కన్స్జూమర్ ప్రొడక్ట్స్ షేర్లు నష్టాలను మూట గట్టుకున్నాయి. సెక్టార్ల పరంగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్లు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు నష్టపోయాయి. ఫార్మా సూచీ 3 శాతం పెరిగింది. రియల్టీ సూచీ 2 శాతం పెరిగింది.
యూఎస్ ఫెడ్ వడ్డీ రెట్లను 25 బేసిస్ పాయింట్లను పెంచింది. ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. భవిష్యత్‌లో నమోదయ్యే గణాంకాల ఆధారంగా వడ్డీ రేట్ల పెంపు ఉంటుంది. మాంద్యం ముప్పు లేదని ఫెడ్ ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.. కానీ దేశీయ సూచీలు మాత్రం భారీ నష్టాలను చూశాయి. బ్యాంకింగ్, ఆటోరంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ రోజు 7 పైసలు బలపడింది.