»Rbi Monetary Policy No Change In Repo Rate 6 5 Percent
RBI మానిటరీ పాలసీ..రెపో రేటులో నో చేంజ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాన్ని ప్రకటించారు. దేశం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యలను చేపట్టినట్లు గవర్నర్ తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాల్గవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈరోజు అక్టోబర్ 6న ప్రకటించింది. RBI గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) మూడు రోజుల సమావేశం బుధవారం ప్రారంభం కాగా.. తాజాగా బ్యాంక్ రెపో రేటును 6.50% , MSF, బ్యాంకు రేటు 6.75 వద్దే మార్చకుండా ఉంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 6న పాలసీ రేట్లు, దాని ద్రవ్య విధానం వైఖరిని యథాతథ స్థితిని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని 4% లక్ష్యంతో కట్టడి చేయడం కోసం ద్రవ్య విధాన దృష్టి కొనసాగుతుందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
ఆగస్టులో చివరి ద్వైమాసిక ప్రకటనలో MPC బెంచ్మార్క్ రెపో రేటును వరుసగా మూడోసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. కమిటీ గత ఏడాది మే నుంచి ఏప్రిల్ 2023 వరకు రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. అప్పటి నుంచి ఇది అలాగే కొనసాగుతోంది. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడంతో జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. ఏది ఏమైనప్పటికీ, ఆగస్ట్ నుంచి వ్యవసాయ వస్తువుల ధరలలో తగ్గుదల MPCకి కొంత ఊరట లభించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఎటువంటి పెంపు చర్యలు తీసుకోకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ ప్రకారం కాలానుగుణ కారకాలు మరింత అనుకూలంగా మారడంతో డిసెంబర్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది. ఆహార ధరలలో పెరుగుదల ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాని కారణమని..అస్థిర వాతావరణ పరిస్థితులు, కూరగాయలు, పాలు, తృణధాన్యాల వంటి ప్రధాన ఉత్పత్తుల ధరలు అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతానికి తగ్గుతుందని, 2023-24లో (FY24) 5.4 శాతానికి తగ్గుతుందని RBI అంచనా వేసింది.