కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శల మీద స్పందించారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేయలనే తొందర తమకు లేదని స్పష్టం చేశారు. టెలికాం సహా నాలుగు వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థల కనీస వాటాను ప్రభుత్వం అట్టి పెట్టుకుంటుందని తెలిపారు. మిగతా వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడం లేదా మూసివేయడం లేదా మరో ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేస్తామని చెప్పారు. ప్రతి సంస్థను అమ్మేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని, అలా అని గుండు సూది నుండి ప్రతి అన్ని వ్యాపారాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పలేం అన్నారు. అవసరాన్ని బట్టి, ప్రజా ప్రయోజనాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటాం అని చెప్పారు. టెలికాం వంటి వాటిని కొనసాగిస్తాం అని చెప్పారు.
ప్రధాని మోడీ పైన విమర్శల మీద మాట్లాడారు. మీరు అంటే ప్రతిపక్షాలు ఎవరు అయిన ప్రధాని మోడీని విమర్శించవచ్చు… ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు.. కానీ అదే సమయంలో మీ పని మీరు చేయాలి కదా అన్నారు.