దివంగత వంగవీటి రంగా (Vangaveeti Mohana Ranga) తనయుడు వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) తెలుగు దేశం పార్టీకి (Telugu Desam) షాకివ్వనున్నారా? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena) పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి జనసేనాని వెంట నడిచేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. వంగవీటి రాధా 2004లో విజయవాడ తూర్పు (Vijayawad East) ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ (Congress) ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేశారు… అదే పార్టీ నుండి విజయం సాధించారు. ఆ తర్వాత 2008లో చిరంజీవి (Chiranjeevi) స్థాపించిన ప్రజారాజ్యం (Praja Rajyam) పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి, నాటి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు (Malladi Vishnu) చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ (YS Jagan) స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో చేరారు. 2014లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయారు. 2019లో విజయవాడ తూర్పు టిక్కెట్ పైన అధినేత నుండి హామీ రాలేదు. దీంతో ఆయన ఎన్నికలకు ముందే పార్టీకి దూరమయ్యారు. నాలుగేళ్ల క్రితం తెలుగు దేశం పార్టీలో చేరారు. ఇప్పుడు మళ్లీ ఆయన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
2024లో జరిగే ఎన్నికల్లో తెలుగు దేశం(Telugu Desam), జనసేన (Jana Sena) పార్టీలు కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి వెళ్లాలనుకోవడం గమనార్హం. పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేనకు రావడం ద్వారా టిక్కెట్ దక్కించుకునే దిశగా అడుగులు కావొచ్చునని అంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పటి నుండి చిరంజీవితో పాటు పవన్ తో వంగవీటికి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో కలపడం, పవన్ నేరుగా పోటీ చేయకపోవడం వంటి వివిధ అంశాలు రాధను పవన్ దిశగా నడిపించలేకపోవచ్చు. ఇప్పుడు పవన్ పొత్తుతో వెళ్తే దాదాపు సగం సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అందుకే కీలక నేతలు అటు వైపుగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
2009లో ప్రజారాజ్యం నుండి రవి యలమంచిలి, కాంగ్రెస్ నుండి దేవినేని రాజశేఖర్, టీడీపీ నుండి గద్దె రామ్మోహన్ రావు పోటీ చేశారు. 2004లో కాంగ్రెస్ నుండి గెలిచిన వంగవీటికి 2009లో ప్రజారాజ్యం నుండి సెంట్రల్ నుండి అవకాశం వచ్చింది. 2014లో వైసీపీ నుండి పోటీ చేసినప్పటికీ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2019లోను అవకాశం రాలేదు. అయితే ఇప్పటికే టీడీపీ నుండి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ సిట్టింగ్ స్థానాన్ని టీడీపీ వదులుకునే అవకాశాలు లేవని అంటున్నారు. పైగా ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారు. విజయవాడ ఈస్ట్ కాకపోయినా సెంట్రల్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ అక్కడ బోండా ఉమ ఉన్నారు. ఆయన 2014లో గెలిచారు. 2019లోను స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో సీటు అంశం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి పక్షం రోజుల్లో పవన్ సమక్షంలో జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ 14వ తేదీ పార్టీ ఆవిర్భావ సభ లేదా మార్చి 22న ఉగాది రోజున చేరవచ్చునని అంటున్నారు.