Perni Nani:పవన్ కల్యాణ్ (pawan kalyan) వారాహి వ్యాన్ ఏదీ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) ప్రశ్నించారు. అక్టోబర్- నవంబర్లో వస్తా అని చెప్పి మాట మార్చారని గుర్తుచేశారు. డిసెంబర్లో ఎన్నికలు వస్తే జూన్ నుంచి తిరుగుతారట.. లేదంటే మరో తేదీ ఉంటుందని అడిగారు. జూన్ నుంచి ప్రజల్లో తిరగడానికి సిద్దంగా ఉన్నానని పవన్ కల్యాణ్ అనడంపై ఆయన స్పందించారు. కిరాణా షాపు గోడ మీద అప్పు రేపు అనేది ఉండేది.. ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉందన్నారు. ఆరునెలలకు ఓసారి సీఎం జగన్ను తిట్టేందుకు పవన్ కల్యాణ్ వచ్చాడని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా జగన్ను తిట్టారని గుర్తుచేశారు. ఆ రోజు తిట్టాల్సింది అప్పటి సీఎం చంద్రబాబును కదా అని అడిగారు.
137 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే.. 30, 40 సీట్లు కూడా గెలిపించలేదని పవన్ అంటున్నారని పేర్ని నాని గుర్తుచేశారు. తెలంగాణలో ఎంఐఎం 7 సీట్లు గెలిపించారని.. తనకు కాపులు ఓట్లు వేయలేదని.. దోషులు ప్రజలు, కాపులని చేశారని అంటున్నారని నాని గుర్తుచేశారు. అందుకోసం ఏం శ్రమించారని.. ఇన్నిరోజుల కష్టం ఏదీ అని సూటిగా అడిగారు. కాపుల్లో ఏ నమ్మకం కలుగజేసుకున్నావు అన్నారు. హైదరాబాద్లో షూటింగ్ వెళ్లకుండా వరసగా 10 రోజులు జనంతో ఉన్నారా అని పేర్ని నాని నిలదీశారు. జనం కోసం జనంలో బతికిన రోజులు ఉన్నాయా అంటూ ధ్వజమెత్తారు. ప్రజల మధ్య బతకాలి కదా.. ప్రజల కష్టాలు వినాలి కదా అన్నారు. అన్న లేదంటే.. నాదెండ్ల మనోహర్ మాటలు వినడమే పని కదా మీకు అని సెటైర్లు వేశారు.
ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తున్నారని ఇంట్లోకి చొరబడి తీసుకెళ్లింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అన్నారు. అప్పుడు బాబుకు పవన్, బీజేపీ మద్దతు తెలుపలేదా అని ప్రశ్నించారు. పద్మనాభాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే.. ఏం చేస్తారోనని కాపు నేతలు భయపడ్డారు. దాసరి నారాయణ రావు, చిరంజీవి రాజమండ్రి వస్తే ముద్రగడను కలువనీయని ప్రభుత్వం చంద్రబాబుది కదా అన్నారు. అలాంటి మీరు చంద్రబాబును నిలదీయాల్సింది పోయి.. కాపులు ఓట్లు వేయలేదని ఎలా అంటారని మండిపడ్డారు.