»Violation Of Section 144 In Telangana Will Result In Strict Action Ceo Vikas Raj
Telangana: తెలంగాణలో 144 సెక్షన్..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఈవో వికాస్ రాజ్
తెలంగాణలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణలో ఎన్నికల (Telangana Elections) ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎవ్వరూ మీడియాతో మాట్లాడకూడదని, ఎటువంటి ప్రచారాలు చేయకూడదని తెలిపారు. ఓటర్లను ఆకర్షించేందుకు నగదు పంచడం వంటివి చేస్తే వారికి జరిమానా, జైలు శిక్ష ఉంటుందన్నారు.
కేంద్ర బలగాలు ఇప్పటికే రాష్ట్రాన్ని మొహరించాయని, అధికారుల కళ్లుగప్పి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని, ఐదారు మంది ఒకేచోట గుంపుగా ఉండకూడదని తెలిపారు. ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,290 ఉన్నారన్నారు. ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ముగిసేవరకూ బార్లు, పబ్ లు, వైన్ షాప్స్ బంద్ అని, రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ మొదలైందని అన్నారు. ఎలాంటి ఎన్నికల మెటీరియల్ను ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రేపు డిస్ట్రిబ్యూటర్ల సెంటర్లకు అధికారులు వెళ్తారన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందన్నారు. ఏదైనా గుర్తింపు కార్డును తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. కేంద్ర బలగాల ఆధీనంలో నిఘా వ్యవస్థ ఉంటుందని, అనుమానంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని సీఈవో వికాస్ రాజ్ హెచ్చరించారు.