ఓ పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.11 లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ మేడ్చల్ జవహార్ నగర్ లో జరిగింది. జవహార్ నగర్ పోలీస్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ ఫేజ్ 1-16బి ఇంట్లో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి వెనుక తలుపులను పగులగొట్టుకుని దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలిపారు. ఇంటి తలుపులను పగులగొట్టి 3 లక్షల 72వేల విలువైన 6 తులాల బంగారు గొలుసులు, ఉంగరాలు, 3 లక్షల విలువైన ల్యాప్ టాప్ లతో పాటు. 3 లక్షల 75వేల రూపాయల విలువైన 5కిలోల వెండి వస్తువులు, రూ.10వేల నగదును అపహరించారు. వీటితో పాటు ఇంట్లో ఉన్న బుల్లెట్ బైక్ ను కూడా అపహరించడానికి ప్రయత్నించి విఫలమైనట్లు పోలీసులు తెలిపారు.
చెల్లెలి పెళ్లి వేడుకను ముగించుకుని అర్థరాత్రి ఇంటి వచ్చేసరికి ఇంటి వెనుక తలుపు పగులగొట్టబడి ఉంది. ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో అంతా చిందరవందర పడిపోవడం, నగదు, బంగారం ఆభరణాలు పెట్టిన చోట ఉండకపోవడంతో దాదాపు 11 లక్షలకు పైగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దొంగతనం పకడ్బందీగా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలిసిన వారే దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు తెలిసినవారై ఉంటారని అన్నారు. ఇంట్లో ఇంత సొత్తు ఉంటుందని దొంగలకు ముందే తెలిసి ఉంటుందని అనుమానిస్తున్నారు. పెళ్లి ఇంట్లో సొత్తు ఉందన్న సమయం తెలిసిందంటే అది ఇంట్లో దొంగపనే అని అన్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండాలని కోరారు.