»The World Bank Has Cut Indias Growth Rate Forecast To 6 3 Percent
India: భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంక్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత(India) జిడిపి(GDP) వృద్ధి అంచనాను డిసెంబర్లో 6.6 శాతం నుంచి 6.3 శాతానికి ప్రపంచ బ్యాంక్(World Bank) సవరించింది. సవాలక్ష బాహ్య పరిస్థితులతో పాటు పెరుగుతున్న రుణ వ్యయాలు, నెమ్మదిగా ఆదాయ వృద్ధి కారణంగా వినియోగ వృద్ధి కూడా నిరోదానికి గురికావచ్చని అంచనా వేసింది.
ప్రపంచ బ్యాంకు(World Bank) భారతదేశం(India) యొక్క 2024 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాను 6.3%కి తగ్గించింది. వినియోగంలో మందగమనం, ఇతర బాహ్య పరిస్థితుల కారణంగా వృద్ది రేటు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ మంగళవారం ఎఫ్వై 24 భారత ఆర్థిక వృద్ధి అంచనాను డిసెంబర్లో అంచనా వేసిన 6.6% నుంచి 6.3%కి తగ్గించింది. అయితే ప్రపంచ బ్యాంక్ చెప్పిన వృద్ధి రేటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ప్రకటించిన FY24 అంచనా 6.4% ఆర్థిక వృద్ధికి సమీపంలో ఉండటం విశేషం. మరోవైపు ఫిబ్రవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇండియా FY23లో 7% వృద్ధి రేటును నమోదు చేస్తుందని గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కరోనా(corona) పాండమిక్ సంబంధిత ఆర్థిక చర్యల ఉపసంహరణ కారణంగా ప్రభుత్వ వినియోగం నెమ్మదిగా పెరుగుతుందని అంచనా వేసింది. ఆ క్రమంలో పెరుగుతున్న రుణ ఖర్చులు, తగ్గుతున్న ఆదాయ వృద్ధి నేపథ్యంలో ప్రైవేట్ వినియోగంపై ప్రభావం పడుతుందని ఏజెన్సీ తెలిపింది.
FY23లో 8.3% వృద్ధితో పోలిస్తే, FY24లో ప్రైవేట్ వినియోగ వృద్ధి 6.9%కి చేరుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. FY23లో 1.2% విస్తరణ తర్వాత FY24లో ప్రభుత్వ వినియోగ వృద్ధి 1.1% తగ్గుతుందని వెల్లడించింది. FY23లో 10.1% వృద్ధిని తగ్గించినప్పటికీ, మూలధన వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల ప్రయోజనం పొందవచ్చని చెప్పింది. ఇంకోవైపు FY24లో వస్తువులు, సేవల ఎగుమతులు 9.2% వద్ద పెరుగుతాయని, FY23లో 11.5% విస్తరణ కంటే కొంచెం తక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
అంతేకాదు వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.6% నుంచి FY24లో 5.2%కి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆస్తుల నాణ్యతలో మెరుగుదలలు, బలమైన ప్రైవేట్ రంగ క్రెడిట్ వృద్ధి కారణంగా భారతదేశ ఆర్థిక రంగం బలంగా ఉందని చెప్పుకొచ్చింది.