తెలంగాణ(telangana) ఎమ్మెల్సీ కవిత(kavitha)ను ఈడీ(ED) అధికారులు అరెస్ట్ అయితే కేసీఆర్(kcr) రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పలు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాగంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) కూడా తన హైదరాబాద్ పర్యటనను మార్చి 12న రావాల్సి ఉండగా..ఒక రోజు ముందే వస్తుండటం పట్ల..కవిత అరెస్టు అవుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ(telangana) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాసనమండలిలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం కెసీఆర్(cm kcr) కుమార్తె ఎమ్మెల్సీ కవిత(mlc Kavitha )నేడు న్యూఢిల్లీ(delhi)లో నిరసన దీక్ష చేయనుంది. అయితే న్యూఢిల్లీకి వెళ్లే ముందే కవిత తన తండ్రి కేసీఆర్ తో మాట్లాడినట్లు సమాచారం. కవితకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆందోళన చెందవద్దని సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మార్చి 9న న్యూఢిల్లీలో తమ ఎదుట హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కవితకు నోటీసులు జారీ చేసింది. కానీ కవిత అభ్యర్థన మేరకు ఈడీ తేదీని మార్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో ఆమె మార్చి 11న ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
అయితే తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే అసెంబ్లీని(assembly) రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో కేసీఆర్(KCR) ఉన్నట్లు బీఆర్ఎస్(BRS) వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) కూడా తన హైదరాబాద్(hyderabad) పర్యటనను మార్చి 11 నుంచి మార్చి 12 వరకు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నిజామాబాద్లో జరగనున్న మేధావుల సమావేశానికి హాజరయ్యేందుకు అమిత్ మార్చి 12న హైదరాబాద్కు రావాల్సి ఉంది. కానీ మారిన కార్యక్రమం ప్రకారం నిజామాబాద్ సభను రద్దు చేసుకుని మార్చి 11న అమిత్ షా హైదరాబాద్(hyderabad) రానున్నారు. కవిత ఈడీ ముందు హాజరు కాగానే అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు ఆయన బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు.
మార్చి 11న కవితను ఈడీ(ED) అరెస్ట్ చేస్తే.. బీజేపీ(BJP) నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనకు దిగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగితే అదే రోజు హైదరాబాద్కు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah).. బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో నిర్ణయిస్తారని పలువురు చెబుతున్నారు.
ఇక నేడు మార్చి 10న తెలంగాణ భవన్లో(telangana bhavan) కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ కేబినెట్ సమావేశంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సంయుక్త సమావేశాన్ని చేపట్టనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో పరిణామాలను బట్టి బీఆర్ఎస్ బీజేపీపై దూకుడుగా ప్రవర్తించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.