రాయలసీమ ప్రాంతంలో విజయవంతంగా టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) కొనసాగుతోంది. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుండగా.. లోకేశ్ అకస్మాత్తుగా యాత్రకు విరామం ప్రకటించారు. ఎందుకంటే శనివారం పవిత్ర రంజాన్ పండుగ ఉండడంతో యాత్రకు విరామమిచ్చారు.
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ కావడంతో పాదయాత్రకు లోకేశ్ విరామం (Break) ప్రకటించి ఆదోనిలో (Adoni) కొనసాగుతుంది. రంజాన్ (Ramadan) సందర్భంగా పాదయాత్రకు విరామం ప్రకటించి ఆదోనీలోనే బస చేశారు. అలుపెరగని పాదయాత్ర చేసిన లోకేశ్ కు కొంత విశ్రాంతి లభించింది. యథావిధిగా ఆదివారం పాదయాత్ర 78వ రోజును పున:ప్రారంభించనున్నారు. కాగా రంజాన్ సందర్భంగా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ముస్లీం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని ఈద్ – ఉల్ – ఫితర్ జరుపుకుంటున్న ముస్లీంలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని కోరుకుంటూ ఈద్ ముబారక్’ అని ముస్లింలకు నారా లోకేశ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా సీఎం జగన్ కు లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ (Selfie Challenge) ల పరంపరం కొనసాగుతోంది. తాజాగా అభివృద్ధి పనుల విషయమై లోకేశ్ సెల్ఫీ దిగి జగన్ కు సవాల్ విసిరారు. ‘అభివృద్ధి అంటే స్టిక్కర్లు, రంగులు వేసుకోవడమా? ఇది ఆదోనిలోని వెంకన్నపేట వార్డు సచివాలయం. పూర్వాశ్రమంలో ఇక్కడ వేలాది పేదప్రజల ఆకలితీర్చే అన్న క్యాంటీన్ ఉండేది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎక్కడా ఒక్క ఇటుక పెట్టడం చేతకాలేదు కానీ, మేం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ భవనాన్ని సచివాలయంగా మార్చేసి తమ పార్టీ రంగులు వేసుకున్నారు. ఇంకా ఎంతకాలం ఈ స్టిక్కర్ల బతుకు ?’ అంటూ లోకేశ్ ట్విటర్ (Twitter)లో నిలదీశారు.