పంద్రాగస్టు వేడుకల(Independence Day)కు ఎర్రకోట ముస్తాబైంది. ఈ తరుణంలో జ్ఞాన్ పథ్‌ను రకరకాల పూలతో అలంకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు 10 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు.
ఇండిపెండెన్స్ డే (Independence Day) వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద 1000 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ నిఘా ఉంచామన్నారు. ఎర్రకోట పరిసరాల్లో ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తుంటామని, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ విస్టా నిర్మాణంలో భాగమైన వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 20 వేలకు పైగా అధికారులు, పౌరులు పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొంటారని, ఈ నేపథ్యంలో రాజ్‌ఘాట్, ఐటీవో, రెడ్ ఫోర్ట్‌తో పాటు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు అధికారులు తెలిపారు.