»Secret Movement Of Rs 12 Crore 1500 Kg Ganja Arrested By Bangalore Police
Ganja: సిక్రెట్ గా రూ.12 కోట్ల గంజాయి తరలింపు..పట్టివేత
ఓ డ్రగ్స్ ముఠా మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి ఉపయోగించే ట్రక్కులో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన కంపార్ట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు అది బట్టబయలు కావడంతోపాటు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయి కూడా దోరికిపోయింది. అది ఎక్కడో ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు శనివారం అంతర్ రాష్ట్ర గంజాయి రాకెట్‌ను ఛేదించారు. ఆ క్రమంలో 12 కోట్ల రూపాయల విలువైన 1500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన చంద్రభాన్ బిష్ణోయ్, విశాఖకు చెందిన లక్ష్మీమోహన్ దాస్ ఏపీ-ఒడిశా సరిహద్దు మన్యం నుంచి గంజాయిని సేకరించి విశాఖలో కట్టలుగా తయారు చేసేవారు. రవాణా కోసం గూడ్స్ వాహనంలో రహస్యంగా ఓ కంపార్ట్మెంట్ను రూపొందించారు. అందులో సరుకులు వేసి బెంగళూరు తరలించారు. దారిలో వాహనం నంబరు మార్చి జాగ్రత్తగా వ్యవహరించేవారు.
అయితే బెంగళూరుకు చెందిన సల్మాన్ అనే వ్యక్తి తమ వద్ద నుంచి తీసుకెళ్లిన గంజాయిని నగరంలో విక్రయిస్తుండగా సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బిష్ణోయ్, లక్ష్మీమోహన్దాస్ల పేర్లు చెప్పడంతో విశాఖపట్నంలో వారి గురించి ఆరా తీసి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన ఇదేనని నగర పోలీసు కమిషనర్ బి.దయానంద్ వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను సిసిబి అరెస్టు చేసింది. రాజస్థాన్‌కు చెందిన చంద్రభాన్ బిష్ణోయ్ (24), ఎంబిఎ విద్యార్థి, అతని సహచరుడు లక్ష్మీ మోహన్‌దాస్ (23) ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు.
నిందితుడికి అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉందని, విశాఖపట్నం చుట్టుపక్కల కొండ ప్రాంతాలలో గిరిజనులు, ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతాలలో పండించే గంజాయిని కొనుగోలు చేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడికి విస్తృత నెట్వర్క్ ఉందని కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో తమ సహచరులతో సమన్వయ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంపై నగర పోలీసులు ఆలోచిస్తున్నారని దయానంద చెప్పారు. చాలా సందర్భాలలో నగరంలో రికవరీ చేయబడిన గంజాయి సాధారణంగా ఈ రెండు రాష్ట్రాల నుంచి వస్తుందని అన్నారు.