మళ్లీ అదే మార్గంలో మరోసారి రైలు పట్టాలు తప్పింది. నెల రోజుల వ్యవధిలో పట్టాలు తప్పడం ఇది రెండోసారి. మొదట ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు రెండోసారి రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 15 బోగీలు పట్టాల పక్కకు జరిగాయి. ఈ సంఘటన విశాఖ-కిరండూల్ రైల్వే లైన్లో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. తెల్లవారుజాము కావడంతో జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లాలో విశాఖ-కిరండూల్ రైల్వే లైన్లో శివలింగపురం వద్ద గురువారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 7వ టన్నెల్ వద్ద రైలు ప్రమాదానికి గురైంది. 15 బోగీలు పట్టాలకు అవతలి వైపు పడిపోయాయి. బోగీలు పడిపోవడంతో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ రైలును రద్దు చేశారు. అధికారులు ప్రమాద స్థలిని సందర్శించారు. పట్టాల పునరుద్ధరణ పనులు వెంటనే చేస్తామని తెలిపారు.
అయితే పట్టాల నాణ్యత పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తున్నది. మొదటి సారి జరిగినప్పుడు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రెండోసారి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైల్వే వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనంతగా బడ్జెట్ లో రూ.లక్ష కోట్లు అదనంగా కేటాయించింది.