శ్రీవిష్ణు మంచి టాలెంటెడ్ నటుడు. ప్రయోగాత్మకమైన అంశాలతో సినిమాలు చేస్తూనే ఉంటాడు. అతని గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అందుకే అతను గేర్ మార్చాడు. ఇప్పుడు సామాజవరగమన అనే ఫ్యామిలీ డ్రామాతో ఈరోజు ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
చిత్రం – సామాజవరగమన నటీనటులు – శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ, తదితరులు స్క్రీన్ ప్లే & దర్శకత్వం – రామ్ అబ్బరాజు నిర్మాత – రాజేష్ దండా సహ నిర్మాత – బాలాజీ గుత్తా బ్యానర్లు- ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ కథ – భాను బోగవరపు డైలాగ్స్ – నందు సవిరిగాన సంగీత దర్శకుడు – గోపీ సుందర్ సినిమాటోగ్రాఫర్ – రాంరెడ్డి ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్ విడుదల తేదీ – జూన్ 29, 2023
టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హిట్టు చూసి చాలా కాలమే అవుతోంది. దీంతో ఈ సారి ఎలాగైనా ప్రేక్షకులను ఆకట్టుకొని, హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే సామజవరగమనతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైటిల్ ఫీల్ గుడ్ గా ఉండటం, ట్రైలర్ నవ్వించేలా ఉండటం, మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ రిలీజ్ చేయడంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంది? శ్రీ విష్ణుకి హిట్ పడిందా లేదో తెలుసుకుందాం.
కథలోకి వెళితే
సామాజవరగమన కథ విషయానికి వస్తే, హీరో, హీరోయిన్ ప్రేమలో పడటం. వారి కుటుంబ సభ్యులతో వారి ప్రేమ కథను ఎలా తెలియజేశారు? వారి ప్రేమకథకు వచ్చిన అడ్డంకులు ఏంటి? అనేదే అసలు కథ. బాలు అకా బాలసుబ్రమణ్యం (శ్రీవిష్ణు) ఏషియన్ సినిమాస్ వద్ద బాక్సాఫీస్ వద్ద పని చేస్తాడు. అతను తన తండ్రి ఉమా మహేశ్వరరావు (Sr నరేష్)కి సహాయం చేస్తున్నప్పుడు అందమైన అమ్మాయి సరయు (రెబా మోనికా జాన్)ని కలుస్తాడు. ఈ ప్రక్రియలో వారు ప్రేమలో పడతారు. కానీ వారు సరయు తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి గ్రీన్ సిగ్నల్ పొందడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఎలాంటి సమస్యలు వచ్చాయి అనే నేపథ్యంలో సినిమా సాగుతుంది.
ఎవరు ఎలా చేశారంటే
శ్రీవిష్ణు అప్రయత్నంగానే ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అతని బాడీ లాంగ్వేజ్ బాగుంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. అతను తన డైలాగ్ డెలివరీలో వేరియేషన్స్ ప్రయత్నించాడు. శ్రీవిష్ణు తన కుటుంబాన్ని ప్రేమించే శ్రద్ధగల కొడుకుగా, తన ప్రేమను గెలవడానికి తన శాయశక్తులా ప్రయత్నించే విసుగు చెందిన యువకుడిగా భావోద్వేగాలు బాగా పంపడించాడు. అతను సినిమాను తన భుజాలపై మోశాడు. అతను చేసిన సినిమాల్లో ఇది బెస్ట్ రోల్ గా అందరికీ గుర్తిండిపోతుంది. రెబా మోనికా జాన్ అరంగేట్రంలో అందరి హృదయాలను గెలుచుకోగలిగింది. బబ్లీ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయి పాత్రలో ఆమె బాగుంది. శ్రీవిష్ణుతో ఆమె కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె కొన్ని సన్నివేశాల్లో అందంగా కనిపించింది. పక్కింటి అమ్మాయి పాత్రకు తగినట్లుగా కనిపించింది. శ్రీవిష్ణు తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ ఈ సినిమాలో లైవ్ వైర్. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సన్నివేశాలను మరో స్థాయికి ఎలివేట్ చేశాయి. శ్రీవిష్ణు, నరేష్ నటించిన సన్నివేశాలు వాతావరణాన్ని ఉర్రూతలూగించాయి. శ్రీవిష్ణు, నరేష్‌లు తమ నటనతో థియేటర్లలో నవ్వులు పూయించారు. శ్రీవిష్ణు స్నేహితుడి పాత్రలో సుదర్శన్ అద్భుతంగా నటించగా, కులశేఖర్ పాత్రలో వెన్నెల కిషోర్ తన సత్తా చాటాడు. శ్రీకాంత్ అయ్యంగార్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మిస్సింగ్ లింక్‌ను కలిపే ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు. రఘుబాబు, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు తమ పాత్రల మేరకు నటించారు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే
దర్శకుడు రామ్ అబ్బరాజు రాసిన సమాజవరగమన కథ కొత్తదేమీ కాదు. ఇంతకుముందు చాలా కథలు వచ్చాయి. కానీ అతను తన స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తో వినోదాత్మకంగా మార్చాడు. పరీక్షలో ఉత్తీర్ణులయ్యే ప్రయత్నంలో నరేష్‌తో తండ్రీ కొడుకుల బంధాన్ని చూపించిన విధానం లేదా రాఖీలు కట్టి ప్రేమను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న శ్రీవిష్ణు ఇలా సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సమయంలో ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అన్ని నవ్వించే సన్నివేశాల తర్వాత, అతను క్లైమాక్స్‌తో అందరి భావోద్వేగాలను టచ్ చేశాడు. అయితే, చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యింది. సినిమాలో కామెడీ సన్నివేశాలు, డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ, సెకండ్ ఆఫ్ మరీ బోరింగ్ గా సాగింది. ముఖ్యంగా కథ ఊహించే విధంగా ఉండటం మైనస్ గా మారింది. పాటలు చూడటానికి అందంగా ఉన్నాయి. మరీ గుర్తుండిపోయేలా అయితే పాటలు లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్‌లో రిపీటెడ్ సీన్స్ వచ్చే చోట కొన్ని డ్రాగ్స్ని మిగిల్చాడు. అయితే, అతను పూర్తిగా డీసెంట్‌గా చేసాడు. హాస్య మూవీస్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
+శ్రీవిష్ణు, నరేష్ యాక్టింగ్
+కొన్ని నవ్వించే సన్నివేశాలు
+స్క్రీన్‌ప్లే, దర్శకత్వం