Revanth Reddy: కేసీఆర్ సీఎం అయ్యేందుకు ఎర్రబెల్లి సహకారం
2014లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ముఖ్యమంత్రి కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) పరోక్షంగా సహకరించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
2014లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ముఖ్యమంత్రి కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) పరోక్షంగా సహకరించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. తెలుగు దేశం పార్టీలో (Telugudesam) ఉంటూనే కోవర్టు ఆపరేషన్ చేసి, నాటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత భారత రాష్ట్ర సమితికి (BRS) సహకరించారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ జెండను లేకుండా చేశాడని ధ్వజమెత్తారు. ఎర్రబెల్లి, ఆయన అనుచరులు ధరణితో దందాలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వందకు పైగా స్థానాల్లో ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2024 జనవరి ఒకటి నాటికి తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం వస్తుందన్నారు. ఆయన హాథ్ సే హాథ్ జోడో యాత్ర వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దేవరప్పుల నుండి పాలకుర్తి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ నిధులు, నియామకాలు, నీటి కోసం తెలంగాణ అని ఉద్యమించామో.. రాష్ట్రం సిద్ధించి ఎనిమిదేళ్లు దాటినా వాటి కోసమే మళ్లీ కొట్లాడవలసి వస్తోందన్నారు. రాష్ట్రం తెచ్చినారనే కృతజ్ఞతతో కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశమిచ్చారని, ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్నారు. ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే వారుకి రూ.5 లక్షలు, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచుతామన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలు చెల్లిస్తామన్నారు. రూ.500కే గ్యాస్ ఇస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఎర్రబెల్లిపై ఛార్జీషీటు
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతలు.. మంత్రి ఎర్రబెల్లి పైన స్థానికంగా ఛార్జీషీట్ విడుదల చేశారు. ఇందులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చార్జీషీటు ప్రకారం… ఎర్రబెల్లి ఏ ప్రభుత్వంలో పని చేసినా 30 శాతం కమిషన్ పథకాన్ని అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పని కోసమైనా నా కమిషన్ ముప్పై శాతం ఉంటుందని ఆయన డిమాండ్ చేస్తారు. కాంగ్రెస్ హయాంలో చెన్నూరు ఇర్రిగేషన్ ట్యాంకు కోసం రూ.360 కోట్లు కేటాయించగా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎర్రబెల్లి మంత్రి అయ్యాక రూ.700 కోట్లకు పెంచి, రూ.250 కోట్లు డిమాండ్ చేశారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. ఆయన భూకబ్జాదారు. పాలకుర్తి నియోజకవర్గంలో యాభై ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని సర్పంచులు కోరగా… గ్రామాల్లోని ఖాళీ మద్యం బాటిళ్లను విక్రయించి, ఆ వచ్చిన మొత్తంతో బిల్లులు చెల్లించాలని ఎర్రబెల్లి సూచించిన విషయాన్ని ఛార్జీషీటులో పేర్కొన్నారు. ఓ వైపు తొర్రూరు ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటుండగా.. తాగునీటి సమస్య పరిష్కారం కోసం కూడా ఆయన కమిషన్ అడుగుతున్నారు. 30 శాతం కమిషన్ ఇచ్చిన వారికి దళితబంధు ఇస్తున్నారు. పాలకుర్తి మండలంలో 100 పడకల హాస్పిటల్, డిగ్రీ కళాశాల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. మంచుప్పుల గ్రామంలో దళితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని 2018లో హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదు. టెక్స్ టైల్ పార్కు ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. ఇలా… ఎన్నో అంశాలను కాంగ్రెస్ చార్జీషీటులో పొందుపరిచింది.