»Rains Red Alert For These 5 Districts In Telangana Cs Orders To Collectors
Telangana:లో ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్…సీఎస్ ఆదేశాలు
తెలంగాణ(telangana)లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు(rains) ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
తెలంగాణ(telangana)లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ(IMD) పేర్కొంది. రాష్ట్రంలో ప్రధానంగా ఐదు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాటిలో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం ఉన్నాయి. తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి సహా మరో 7 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
వాయువ్య బంగాళాఖాతం సమీపంలో ఏర్పడిన ద్రోణి, ఛత్తీస్ఘడ్పై మరో ద్రోణి కారణంగా అనేక చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ(IMD) హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్(CS) జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. దీంతోపాటు నీటి పారుదలశాఖ అధికారులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.