ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ పైన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చేసారి దుబ్బాక రావాలని సవాల్ చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏంటి అనేది వచ్చే ఎన్నికల్లో చూపిస్తానాన్నారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 50 కాదని, 119 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు.15 సీట్లు గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ కింద పని చేస్తానని అక్బరుద్దీన్ అనడం సిగ్గుచేటు అన్నారు. అక్బర్, కేసీఆర్.. బీహార్‌కు సంబంధించిన వ్యక్తులేమో అనే అనుమానం కలుగుతుంది. రాష్ట్రంలో బీహార్‌కు చెందిన అధికారులను తెలంగాణ సీఎస్, డీజీపీగా కేసీఆర్ నియమించారన్నారు.
93 మంది ఐపీఎస్ బదిలీల్లో తెలంగాణ ఐపీఎస్ అధికారులకు ఒక్కరికి కూడా ప్రాధాన్యం కలిగిన పోస్టులు ఇవ్వలేదన్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని, గట్టిగా మాట్లాడే విపక్షాల నేతలను అరెస్టు చేసేందుకు మంచి పోస్ట్ ఇచ్చారన్నారు. స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నవారిని రబ్బరు బుల్లెట్లతో కాల్చిన వ్యక్తి అన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ బీహార్ వ్యక్తి అని, ఆంధ్రా వాళ్ళు అంటే కాదని తాము వాదించామన్నారు. కాని ఇప్పుడు తమకు అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు చెందిన హోం గార్డ్ నుండి సీనియర్ ఐపీఎస్‌లు.. కేసీఆర్ ఏం చేస్తున్నారో ఆలోచన చేయాలన్నారు. ఉద్యమం ప్రారంభమైనప్పుడు జలదృశ్యం లో కేటీఆర్ లేరన్నారు. అప్పుడు అమెరికాలో ఉద్యోగాలు చేసేవారన్నారు. అసెంబ్లీలో తమకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. కెసిఆర్ చెబుతున్నట్లు తాము వకీల్ సాబ్ నే అని, తెలంగాణ ఉద్యమంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యమకారుల కోసం పని చేసిన వ్యక్తిని కూడా అని అన్నారు. తెలంగాణ మొత్తం తమ కుటుంబం అని చెప్పుకునే కేటీఆర్ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదో చెప్పాలని అన్నారు. పోలీసు కిష్టయ్య, డీఎస్పీ నళినిలు, శ్రీకాంతాచారి కుటుంబం తెలంగాణ కుటుంబం కాదా అని ప్రశ్నించారు.