కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు (karnataka assembly elections) సమీపిస్తున్న తరుణంలో నటుడు కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) అధికార బీజేపీ పార్టీకి (BJP party) మద్దతు తెలిపారు. ఓ సమయంలో ఆయన పార్టీలో చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ, వాటిని కొట్టి పారేశారు. అయితే బీజేపీకి మద్దతు తెలిపారు. దీనిపై నటుడు ప్రకాశ్ రాజ్ (prakash Raj) స్పందించారు. సుదీప్ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, తన మనసు గాయపడిందన్నారు. ఉదయం నుండి కిచ్చా సుదీప్ పైన వార్తలు వచ్చాయి. బీజేపీలో (bjp) చేరుతున్నారట కదా అని అంతకుముందు ఉదయం అడగగా.. ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, అవి అంతా ఊహాగనాలేనని, మీడియా కథనాలు ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేశారు. కమలం పార్టీ బుట్టలో పడే వ్యక్తి కాదన్నారు. ఆయన చాలా తెలివైన వాడు అన్నారు. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరాశతో ఉన్న బీజేపీ నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. కానీ ఆ తర్వాత సుదీప్ బీజేపీకి మద్దతు పలికారు.
తాను బీజేపీకి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించిన సమయంలో విలేకరులు ప్రకాశ్ రాజ్ మాటలను గుర్తు చేశారు. మీరు కమలం పార్టీకి మద్దతు పలకరని ఆయన వ్యాఖ్యానించారు అని చెప్పగా.. ప్రకాశ్ రాజ్ చెప్పాలనుకున్నది ఆయన చెప్పారని.. అలా చెప్పవచ్చు కూడా అన్నారు. ఆయనను సినీ నటుడిగా గౌరవిస్తానని, ఆయన సినిమాల కోసం తాను కూడా ఎదురు చూస్తానని చెప్పారు.
కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉన్న కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
అంతకుముందు సుదీప్ కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో సీఎంతో కలిసి పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. ఈ పరిణామంపై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. బీజేపీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుందని ఎంపీ, కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జ్ రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు. అయితే ఆరున్నర కోట్ల కన్నడ ప్రజలే ఎన్నికలను ప్రభావితం చేస్తారన్నారు.