BRSను బంగాళాఖాతం(Bay of Bengal)లో పడేయటం కాంగ్రెస్ కు సాధ్యమని పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivas) వ్యాఖ్యానించారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా వెల్లడించారు. అంతేకాదు వారం రోజుల నుంచి ఈ సభ ఏర్పాటు నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అనేక ఇబ్బందులు పెట్టినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలుగా అనేక మంది పోరాడిన కూడా తెలంగాణ రాలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లు పొంగులేటి స్పష్టం చేశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR) ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు దాటినా కూడా రుణమాఫీ గురించి మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ మాదిరిగా చేయదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటక మాదిరిగా వెంటనే హామీలను నెరవేరుస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.