»Police Arrest The Two People Who Try To Cheat People With Name Of Minister Harish Rao
Minister Harish rao: పేరిట ఘరానా మోసం.. కేటుగాళ్లు అరెస్ట్..!
కాస్త నమ్మాం అనుకుంటే చాలు ఎవరైనా మోసం చేయడానికి రెడీగా ఉంటారు. మనలో చాలా మంది కూడా ఎవరైనా నమ్మకంగా నాలుగు మాటలు చెబితే వెంటనే వారు ఎవరు అనేది కూడా ఆలోచించకుండా నమ్మేస్తాం. ఇక సెలబ్రెటీల పేర్లు చెబితే గుడ్డిగా నమ్మేస్తాం. అలా నమ్మేవారిని మోసం చేసేవాళ్లు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు.
తాజాగా ఇద్దరు వ్యక్తులు తెలంగాణ మంత్రి హరీష్ రావు పేరు చెప్పి జనాలను మోసం చేయడం మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు చిక్కారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బహదూర్ పల్లి దుండిగల్ కు చెందిన పేరాల వెంకటేశ్, గండిమైసమ్మకు చెందిన గడ్డమీద రాజేష్ కుమార్ స్నేహితులు. ఇద్దరూ పనీ పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అనేది వీరి ప్లాన్. దాని కోసం వారు ఏకంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు పేరు వాడుకోవడం మొదలు పెట్టారు.
పథకం ప్రకారం ప్రతిసారీ హరీష్ రావు కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వీరు వెళ్లడం మొదలుపెట్టారు. తాముు హరీష్ రావు మనుషులమే అనే నమ్మకం అందరిలో కలిగేలా చేశారు. ఆ తర్వాత పలువురు బిల్డర్లు, వ్యాపారవేత్తలతో పరిచయం పెంచుకున్నారు. తాము హరీష్ రావు కి చాలా క్లోజ్ అని..తమ వల్ల ఎన్నో పనులు అవుతాయని చాలా మందిని నమ్మించారు. పక్కా ప్లాన్ ప్రకారం.. ‘హరీష్ అన్న సేవా సమితి’ పేరుతో 2016లో ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించారు.
ఈ సంస్థకు నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత గుండాల మల్లేశ్ గౌడ్ ను ఆ సమితీ అధ్యక్షుడిగా పేరు నమోదు చేశారు. విచిత్రం ఏంటంటే ఈ విషయం మల్లేశం గౌడ్ కి కూడా తెలియదు. అంతేకాదు ‘హరీష్ అన్న సేవా సమితి’ పేరుతో ఉన్న రశీదులో మొదటి దాతగా మంత్రి హరీష్ రావు పేరుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతల, కార్యకర్తల పేర్లు ముద్రించారు.
ఈ పుస్తకాలతో బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలను కలిసి డబ్బులు వసూల్లు చేస్తున్నట్లుగా నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే డీసీపీ రాధాకిషన్, పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ రంగంలోకి దిగి నిందితులిద్దరినీ పట్టుకున్నారు. రశీదు బుక్కులు, 4 సెల్ఫోన్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.